Aug 25, 2010

గోడలో ఇంకో ఇటుక?


మీరు పింక్ ఫ్లోయ్డ్ 'ANOTHER BRICK IN THE WALL' పాట విన్నారా? నా ఈ టపాకి కారణమైన ఆలోచనకి బీజం వేసిన పాటది. ఆ పాటలో ఉన్న సంగీతం పెద్ద గొప్పగా ఏమీ అనిపించలేదు గానీ, పాటలోని ఆ వాక్యం మాత్రం నాకు చాలా కాలం గుర్తు ఉండి పోయింది. గోడలోని ఇటుకల్లో ఇంకో ఇటుకలా  తయారుచేసే ఈ ఎడ్యుకేషన్ మాకు వద్దు అని పిల్లలు పాడుతుంటారు. అది కేవలం ఎడ్యుకేషన్ లోనే కాదు ఇంకా చాలా విషయాల్లో అది అన్వయించుకోవచ్చు అనిపించింది వింటుంటే. సరిగ్గా ఆలోచిస్తే అందరం కూడా గోడలోని ఇటుక లాంటి వాళ్ళమే.

అందరికీ జీవితంలో ఏదో సాధించేయ్యాలనే ఉంటుంది.
అందరికీ మంచి ఇల్లు కావాలి.
అందరికీ తనను అర్ధం చేసుకునే (ఈ అర్థం చేసుకోవడం ఏంటో, నాకు ఇప్పటికీ అర్థం కాదు) జీవిత భాగస్వామి కావాలి.
అందరికీ మంచి ఉద్యోగం కావాలి.........కావాలి......కావాలి.

అందరివీ అవే ఆలోచనలు. అవే కోర్కెలు. ఇంకేరకంగా నేను ప్రత్యేకం అనే ప్రశ్న వేసుకుంటే...నాకు సమాధానం దొరకడంలేదు.
Madagascar2 మూవీ లో ఉండే జీబ్రా కి కూడా సరిగ్గా ఇదే ఫీలింగ్ కలుగుతుంది. జూ లో ఉన్నప్పుడు అది రకరకాల విన్యాసాలు చేస్తుంది. అది నేను మాత్రమే చెయ్యగలను అనుకుంటుంది. చివరకి జూ నుండి తప్పించుకొని అడవిలోకి వెళ్ళినప్పుడు అక్కడ తనలాగే చాలా జీబ్రాలు ఉంటాయి. ఇది చేసే విన్యాసాలన్నే అవి కూడా చేస్తాయి. వాటి మధ్యలో ఆ జీబ్రాని దాని బెస్ట్ ఫ్రెండ్ అయిన సింహం కూడా గుర్తు పట్టలేకపోతుంది. అప్పుడు అది, శతకోటి లింగాల్లో ఒక బోడి లింగాన్ని, గుంపులో గోవిందాన్ని, నలుగురు లో నారాయణని అనుకుంటూ తెగ బాధపడిపోతుంది. అప్పుడు దాని ఫ్రెండ్ అయిన సింహం దాన్ని కొంచెం మెలోడ్రమాటిక్ గా మామూలుగా చేస్తున్దనుకోండి. కాని ఎంత ఆలోచించినా  ఈ ఫీలింగ్ అప్పుడప్పుడూ బాధ పెడుతుంటుంది. దాన్ని పట్టించుకోకుండా వదిలేయడం తప్ప ఇంకేం చెయ్యలేకపోతున్నా.

ఇంతకీ ఏంటి నీ గోల.....శతకోటి లింగాల్లో ఒక బోడి లింగానివి....నీ గోల మేము పట్టించుకోవాలా??? అంటారా......అయితే ఓకే.