Jun 29, 2010

లెక్కల్లో.. జనాభా లెక్కలు వేరయా..4

ఆ రోజు సోమవారం. సోమవారం స్కూల్ కి వెళ్ళడమే అసలు ఒక  నీరసం, అది కాకుండా వచ్చే వారం  నుండి జనాభా లెక్కల కోసం ఊరూరా తిరగాలి.  ఆ ఆలోచన రాగానే తలంతా గాలి తీసేసిన బుడగలా అయిపోయింది. ఈసురూమంటూ..ఎందుకొచ్చిందిరా భగవంతుడా అంటూ......కాళ్ళీడ్చుకుంటూ స్కూల్ కి వెళ్ళా. కొన్ని  రోజుల కిందట నాకో అద్భుతమైన ఆలోచన వచ్చింది. ఒక వారం రోజులు సిక్ లీవ్ పెట్టేస్తే ఎలా ఉంటుందని. నాకెప్పుడు ఒంట్లో బాగోపోయినా నేను తప్పకుండా స్కూల్ కి వెళ్తాను.  ఊరికే సిక్ లీవ్ వృధా అవ్వడం నాకు ఇష్టం ఉండదు. తుమ్ముతూ.. దగ్గుతూ.. ముక్కుతూ... మూలుగుతూ స్కూల్ లోనే గడిపేస్తాను. అలాంటిది ఇప్పుడు సిక్ లీవ్ పెడితే.. అదీ వారం రోజులు... నమ్ముతారా అన్న అనుమానం కూడా కలిగింది. సరిగ్గా ఈ రోజుకి పది రోజులు ముందు "బడి బాట" అని చెప్పి స్కూల్ మానేసిన మా ఊర్లోని మురికి వాడల్లోని పిల్లల్ని తిరిగి స్కూల్ లో చేరిపించే కార్యక్రమం ఒకటి జరిగింది. దానికి వెళ్ళడానికి పేర్లు ఇమ్మని మా హెడ్ మాస్టారు గారు ఉపాధ్యాయులందర్నీ అడిగారు. క్రితం సంవత్సరం ఇలాంటిదే ఏదో కార్యక్రమం లో అక్కడికి వెళ్ళిన మా తెలుగు మాస్టారుకి  విరేచనాలు పట్టుకుని ఓ నెల రోజులు సెలవెట్టాడు. ఆ అదృష్టం నన్ను వరించకపోతుందా అన్న ఆశతో నేను వెళ్తానని చెప్పా. అది విన్న మా సోషల్ మాస్టారు నా దగ్గరకొచ్చి బుజం మీద చెయ్యేసి " చాలా సంతోషం బ్రదర్. మనం ఇద్దరం ఈ ఊర్లో భావి తరాల్లో నిరక్ష్యరాస్యత అనేదే లేకుండా చేద్దాం బ్రదర్." అన్నాడు NTR స్టైల్లో (ఈయనకు కొంచెం అభ్యుదయ భావాలు ఎక్కువ లెండి ). మేమిద్దరం కలసి మురికి వాడలన్నీ సందు సందు గొందు గొందు తిరిగాం. చాలా మంది పిల్లల్ని తిరిగి స్కూల్ లో చేర్పించాం. హెడ్ మాస్టారు తెగ ఆనందపడిపోయాడు. నేను మాత్రం బేర్ మన్నాను. ఇంతా తిరిగి నేను పిడుగు రాయిలా ఉన్నా. మా సోషల్ మాస్టారు మాత్రం ఒంట్లో బాగోలేదని ఒక రోజు సెలవు పెట్టాడు. ఎలాగూ మురికి వాడలన్నీ తిరిగాం కదా ఏదో రోగం వచిందని నటించేస్తే సెలవు దొరుకుతుందని రెండు రోజుల నుండి భోజనం సరిగ్గా చెయ్యడం మానేసా. రాత్రిళ్ళు నిద్ర పోవడం కూడా మానేసా. (నిద్ర సరిగ్గా పట్టకుండా ఉండాలంటే నా దగ్గర ఒక కిటుకు ఉంది. పడుకోబోయే ముందు ఓ చెంబుడు నీళ్ళు తాగెయ్యటమే. గంట లో లఘుశంక ప్రారంభమవుతుంది. శంక తీరాక మళ్లీ ఓ చెంబుడు. ఈ సారి అరగంటకే శంక మొదలవుతుంది. ఇలా ఒక రాత్రిలో పదిసార్లు లేస్తే ఇంక నిద్రేం పడుతుంది!!). దాంతో కళ్ళు పీక్కుపోయాయి.

హెడ్ మాస్టారు చూసి "అదేంటయ్య అలా నీరసంగా అయిపోయావ్. మురికి వాడల దెబ్బ అనుకుంటా. ఒక పని చెయ్యి. రేపు ఎల్లుండి సెలవు తీసుకుని ఇంట్లో విశ్రాంతి తీసుకో. నేను ఇంకో పది రోజులు సెలవు లో ఉంటాను. ఆ జనాభా లెక్కల కోసం కావలిసిన సామగ్రి అంతా ఈరోజు వచ్చింది. అవనీ స్టోర్ రూం లో పెట్టించాను. అందులో మనం తిరగవలిసిన ఏరియాల లిస్టు కూడా ఉంది. మన మాస్టార్లే కాకుండా మన పక్క ఊరి హైస్కూల్ మాస్టార్లుకూడా మనతో కలిసి తిరుగుతారు. వాళ్ళ పేర్ల లిస్టు కూడా అందులో ఉంది. వాళ్ళలో ఎవరెవరు ఏయే ఏరియాలు తిరగాలో ఆ పని అంతా నువ్వే చూడాలి. ఇంకేవరికన్నా చెబుదామంటే అంతా తింగరమేళం. ఏం చెప్తే ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. పైగా నువ్వు ట్రైనింగ్ కి కూడా వెళ్ళావ్. మొన్న నువ్వు బడి బాట లో చూపిన ఉత్సాహం చూసి నువ్వొక్కడివే దీనికి సమర్దుడవని నాకు తెలుసు. ఇవిగో స్టోరే రూం తాళాలు. ఆరోగ్యం జాగర్త "
అని చావు కబురు చల్లగా చెప్పి చక్కాపోయాడు. ఇంకేం సిక్ లీవ్ నా బొంద!!

Jun 24, 2010

లెక్కల్లో.. జనాభా లెక్కలు వేరయా..3

రామం గాడు సిగ్గుతో ఏం మాట్లాడాలో అర్థం కాక తల దించుకున్నాడు. ఈలోపులో బట్టతలాయన  స్టేజి ఎక్కి కొంచెం రామం గాడికి సాయం చేద్దాం అన్నట్టు వాడి మీద చెయ్యి వేసి " జోకు బావుంది కాని, ముందు అడగాల్సిన ప్రశ్న అది కాదు, ఇంటి పెద్ద ఎవరు? అని అడగాలి" అని చెప్పి నన్ను పక్కకు తీసుకెళ్ళాడు."మీరు వాళ్ళు అడిగిన ప్రశ్నలకి దేనికీ సూటిగా సమాధానం చెప్పొద్దు. సాధ్యమైనంత వంకరగా కంఫ్యుజు చేసేలా ఉండాలి. అప్పుడే వాళ్లకి ప్రశ్నలు ఎలా అడగాలో తెలుస్తుంది" అన్నాడు. పాత సినిమా లో రాజనాల లాగ వికటాట్టహాసం చెయ్యాలనిపించింది. అసలే మనం చూసి రమ్మంటే తగలేసి వచ్చే టైపు. మళ్లీ ఎవరి పొజిషన్ లో వాళ్ళు నిలబడ్డాం. రామం గాడు అడగడం మొదలెట్టాడు.
" ఇంటిపెద్ద మీరేనా?"
"ఏ...ఇంటి పెద్దతో తప్ప మాతో మాట్లాడరా..."
ఇలాంటి తింగర సమాధానాలతో ప్రేక్షకులను బాగా అలరించాను. నా వంకర సమాధానాలతో ట్రైనింగ్ కి వచ్చిన చాలా మంది డౌట్స్ తీరిపోయాయి. అంతా అయ్యాక బట్టతలాయన, నా వల్ల చాలా డౌట్స్ తీర్చగలిగాడని, నా లాంటి యువకుల అవసరం దేశానికీ చాలా ఉందని మరీ మరీ చెప్పాడు.  సాయంత్రం ట్రైనింగ్ పూర్తి అయ్యాక నేను హుషారుగా, రామం గాడు మొహం వేళ్ళాడేసుకుని ఒకే బస్సు ఎక్కాం. రామం గాడి బాధ చూసి తట్టుకోలేక " ఏరా రామం, ఎందుకు అంత బాధ పడుతున్నావ్" అన్నాను.
" మీరు మరీ అంతా వంకరగా మాట్లాడగలరని నాకు తెలీదండి"
" ఏంట్రా ఇంకా దాని గురించే ఆలోచిస్తున్నవా? అదేదో జనాలకి అర్థం కావడానికి అలా మాట్లాడమని చెబితే అలా చేశాను. నువ్వు మరీ ఇంత ఫీల్ అవుతావని అనుకోలేదు."
" అయన చెబితే మాత్రం, ఎదురుగా ఉన్నది నేనే కదా. మరీ అంతా ఎడిపించాలా?"
" సారీ రా. ఏమి అనుకోకు. ఐనా ఏ మాట కా మాటే చెప్పుకోవాలి. అలా వంకరగా మాట్లాడుతుంటే యమా సరదాగా ఉందిలే."
"ఆ. ఆ ఉంటుంది ఉంటుంది. రేపు మీరు  ఫీల్డ్ కి వెళ్ళినప్పుడు ఎవడన్నా అలా వాగితే అప్పడు తెలుస్తుంది ఆ సరదా."
" ఆ అప్పుడు చూద్దాం లే. ఐనా ఎవడన్నా అలా వాగితే, వాడి దగ్గర నుండి తెలివిగా సమాధానాలు రాబట్టుకోవాలి గాని, ఇలా నీలా ఏడుస్తాననుకున్నావా."
" ఇదుగో.... మీకు  నా శాపం, మీరు వెళ్ళిన ప్రతి చోట మీకన్నా మెంటలోళ్లు మీకు తగలగలరు గాక!!!!" అన్నాడు విశ్వామిత్రుడి టైపు లో ఊగిపోతూ.
" ఏడిసావ్ లే"
ఇంకా ఏదో కబుర్లు చెప్పుకుంటుండగా రామం స్టాప్ వచ్చింది. వాడు దిగిపోయాక, కొంపదీసి రామం గాడి శాపం నిజం అవదు కదా అని ఆలోచిస్తూ నిద్ర పోయాను. ఇదే లాస్ట్ స్టాప్ దిగండి దిగండి అన్న బస్సు డ్రైవర్ అరుపులతో మెలకువ వచ్చింది. దిగి తిన్నగా ఇంటికి వెళ్లి స్నానాదికాలు పూర్తి అయిన తర్వాత ట్రైనింగ్ లో ఇచ్చిన manuals చదవడం మొదలెట్టాను. అలా కొన్ని రోజులు రోజూ రాత్రి చదివాక నాకు మొత్తం అంతా కంటస్థం వచ్చేసింది.

Jun 16, 2010

లెక్కల్లో.. జనాభా లెక్కలు వేరయా..2

బస్సు స్టాండ్ నుండి తిన్నగా Z.P.H స్కూల్ కి వెళ్ళా. అక్కడ ఓ పెద్ద ఫంక్షన్ హాల్లో ట్రైనింగ్ ఏర్పాటు చేసారు. అనుకున్నట్లు గానే గోల గోల గా ఉంది. చివర్లో ఖాళీగా ఉన్న ఓ కుర్చీ లో కూర్చున్నానో లేదో పెద్ద ఫైల్ ఒకటి తీసుకు వచ్చి నా ఒళ్లో పడేసారు. దాంట్లో ఎంత మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారో, ఎవరి కింద ఎవరు పని చెయ్యాలో, అసలు ఎవరేం చెయ్యాలో సుదీర్ఘంగా రాసి ఉంది. ఓ బట్టతలాయన స్టేజి ఎక్కి ఏదో చెప్పడం మొదలెట్టాడు. ఆ రోజు మాకు ట్రైనింగ్ ఇవ్వబోయే వ్యక్తి అతనే అనుకుంటా. మేం చెయ్యాల్సిన పనులన్నింటిని వివరంగా చెబుతున్నాడు. నేను నిద్ర లేచేసరికి ఒంటి గంట అయ్యింది. " ఇవి మీ విధులు. మధ్యానం ఒక రిహార్సల్ చేద్దాం. ఎవరికన్నా ఏమైనా డౌట్స్ ఉంటే అప్పుడు క్లియర్ అవుతాయి. ఇంకా ఎమన్నా ఉంటే తర్వాత అడగొచ్చు." అని చెప్పి ముగించాడు. అందరూ బైట చెట్ల కింద కూర్చుని ఇంటి నుండి తెచ్చుకున్న కారియర్ పని పట్టే పన్లో ఉన్నారు. నేను బద్ధకంగా ఓ బెంచీ మీద కూలబడ్డా. ఇంతలో ఓ యాభై ఏళ్ళ ఆయన వచ్చి నా పక్కన కూర్చుని తను కూడా తినడం మొదలెట్టాడు. మధ్యలో నా వంక చూసి ఓ సారి పళ్ళికిలించాడు. నేను కూడా పళ్ళికిలించాను. ఆ సందు చూసుకుని మొదలెట్టాడు, 
"మీరు ట్రైనింగ్ అంతా నిద్ర పోయినట్టున్నారు. నేను చూసా"
 " అవును ", అన్నా ముభావంగా.
"మీరు అలా నిద్ర పోతే రేపు ఎలా చెయ్యాలో తెలియకపోతే ఏం చేస్తారు" 
ఏదో చేస్తాను, నీకెందుకయ్యా అందామనుకుని ఆగి " మీలాంటి పెద్దలు ఎవరూ ఒకరు సాయపడకపోరు లెండి" అన్నాను.
క్లాసు పీకడం మొదలెట్టాడు. ఆ ఊ అని ఏకాక్షర సమాధానాలతో సరిపెట్టి, త్వరగా హాల్లోకి దూరాను. బట్టతలాయన మొదలెట్టాడు.
 "ఇప్పుడు నేను కొంత మందిని సెలెక్ట్ చేస్తా. వాళ్ళలో కొంతమంది జనాభా లెక్కల ఆఫీసర్స్ లాగ చేస్తూ మిగతా వాళ్ళని ప్రశ్నలు అడుగుతారు వాళ్ళు సమాధానాలు చెప్పినదాని బట్టి మీ దగ్గర ఉన్న గ్రీన్ ఫారం ఫిల్ చెయ్యండి నేను వచ్చి చూస్తా."
మీరు...మీరు...అని ఇద్దర్ని సెలెక్ట్ చేసాడు. అందులో ఒకడు నా జునియర్ గా చదువుకుని పక్క ఊళ్ళో లెక్కల మాస్టారుగా పని చేస్తున్న రామం గాడు. వాడసలు కనపడలేదు ఉదయం నుండి, లేకపోతే వాడితో సోదేసి వాడిని కూడా వినకుండా చేసేవాడిని. ఇంకా.... మీరు అని చివర్లో భుక్తాయాసం తో తూలుతున్న నన్ను చూపించాడు. నా గుండెలో రాయి పడింది. అసలే మనమేం వినలేదు. ఇప్పుడు వీడు మనల్ని ప్రశ్నలు అడగమంటే ఎలా. టెన్షన్ పడుతూ స్టేజి ఎక్కా. మిగతా ఇద్దర్ని ప్రశ్నలు అడగమని, నన్ను సమాధానాలు చెప్పమన్నాడు. హమ్మయ్య టెన్షన్ తగ్గింది.
రామం గాడు అడగడం మొదలెట్టాడు. " పేరు చెప్పండి ఆనంద్ గారు" అంతా గొల్లున నవ్వారు.

Jun 15, 2010

లెక్కల్లో.. జనాభా లెక్కలు వేరయా..1

నా పేరు ఆనంద్. అమ్మ నన్ను ఆనందం అని పిలుస్తుంది. సరితేమో ఆనూ అని పిలుస్తుంది. సరిత నా భార్య, అన్నట్టు నాకు ఈ మధ్యే పెళ్లైంది. నేను గవర్నమెంట్ స్కూల్ లో ఇంగ్లీష్ పంతులు గా పని చేస్తున్నా. నాలుగు రోజుల క్రితం దాకా చాలా ఆనందం గా కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎలా ఉంటారో అలాగే ఉండేవాన్ని. ఆ విషయం తెలిసినప్పటి నుండి జీవకళ పోయింది. రాత్రుళ్ళు నిద్ర పట్టక కళ్ళ కింద నల్లని చారలు బయలుదేరాయి.  అమ్మాయితో గోడవేమన్నా పడ్డావా వెధవ కానా అని అమ్మ బుర్ర తినడం మొదలెట్టింది.అమ్మతో చెప్పలేని బాధ ఎమన్నా ఉంటే నాతో చెప్పరా అని నాన్న!!!!  
 ఏమని చెప్పను నా బాధ....జనాభా లెక్కలు మొదలయ్యాయి మరి. జనాభా లెక్కలంటే నీకెందుకు అం.. త  బాధ అని మీరు అడగొచ్చు. నాక్కాకపోతే ఇంకెవరికి.. ఆమాటకొస్తే ఎలక్షన్లు వచ్చినా..పోలియో చుక్కలు వేయ్యాల్సోచ్చినా..జన్మభూమి..గుడి బాట..బడి బాట.. శ్మశానం బాట..ఇలా ఏమి వచ్చినా..ప్రభుత్వానికి గుర్తుకు  వచ్చేది మేమే. అందులోనూ జనాభా లెక్కలంటే మరీ బాధ ఎందుకంటే ప్రతి తలకు మాసినవాడింటికి వెళ్లి, అవే ప్రశ్నలు, అడిగిందే అడిగి, రాసిందే రాసి...ఈ ఎండల్లో..అబ్బ ఎంత బోరింగో. ఇందుకు బాధ అని ఇంట్లో చెబుదామంటే మగ పుట్టక పుట్టి ఆ మాత్రం పని చెయ్యలేవా.. ఆడాళ్ళే చేసేస్తున్నారు ఈరోజుల్లో ....అంటారు అమ్మ నాన్న కూడబలుక్కుని. సరితకు చెప్పుకున్దామంటే ఇంత చిన్న విషయానికి ఎందుకంత ఆలోచిస్తారు అనేస్తుంది. నిజం చెప్పాలంటే తను నాకన్నా చాలా ధైర్యం కలది. నువ్వు ఉద్యోగం చెయ్యడం నాకిష్టం లేదు అని నేను అనడం వల్ల ఆగింది గాని లేకపోతే ఓ మోస్తరు కంపెనీ కి CEO అయ్యే లక్షణాలు పుష్కలం గా ఉన్నాయ్. నేను చిన్నప్పటి నుండి కొంచెం చురుకు. నా చురుకుదనం చూసి తట్టుకోలేక నాన్న ఇంజనీరింగ్ కోసం వేరే ఊరు పంపలేదు. అందుకని బడి పంతులుగా సెటిల్ అవ్వాల్సివచ్చింది. అలాగని నేనేదో ఎప్పుడూ ఏడుస్తూ..ఏంట్రా ఈ జీవితం అంటూ బతుకుతుంటానని మీరు అనుకోవక్కరలేదు. టీచింగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఏదో ఇంజనీరింగ్ చదివి ఉంటే..మన తెలివి లోకకల్యాణం కోసం ఉపయోగపడేది కదా అని. నా చురుకుదనాన్ని కనిపెట్టిన మా హెడ్ మాస్టారు ఇలాంటి పనులు ఏం వచ్చినా నాకే చెబుతుంటారు. అక్కడికీ జనాభా లెక్కలు మొదలెట్టబోతున్నారని టీవి లో చెప్పినప్పటి నుండి స్కూల్ కి గడ్డం పెంచుకుని, మొహం వేళ్ళాడేసుకుని వెళ్ళడం మొదలెట్టా. ఆయినా ఈ అధ్బుతమైన ఆవకాశం మననే వరించింది.
 రేపటి నుండి ట్రైనింగ్ ,ఏలూరు లో, మా ఊరినుండి ఉదయాన్నే ఐదింటికే బస్సు. అంటే మనం నాలుగింటికల్లా లేవాలి. అమ్మ మూడింటికే మొదలెడుతుంది..లేరా..లేరా అని. నేను అనుకున్నది తప్పు అని మర్నాడు  తెలిసింది. ఒంటిగంటకోసారి .. రెండింటి కోసారి..మూడింటికి ఓసారి లేపి... నువ్వు నాలుగింటికి లేవాలి అని చెప్పింది. ఆ విధంగా నాలుగింటికన్నా ముందే లేచి నాలుగింటికి కి బయలుదేరదీయబడి నాలుగుంపావు కల్లా బస్టాండ్ కి చేరుకొని అయిదున్నర దాకా దిక్కులు చూస్తూ కూర్చున్నా. బస్సు గేర్ రాడ్ మధ్యలోకి విరిగిపోవడం వల్ల, వేరే బస్సు లోది పీకి ఇందులో బిగించి వచ్చేసరికి లేటు అయ్యింది అని కండక్టర్ని అడిగితే చెప్పాడు. నిజంగా అదే జరిగిందో లేక నా మొహం చూసేసరికి వాడికి అలా చెప్పాలని అనిపించిందో నాకు అర్థం కాలేదు. బస్సు ఎక్కగానే నిద్ర పట్టేసింది. మెలకువ వచ్చేసరికి ఏలూరు పొలిమేరల్లో ఉంది బస్సు.

Jun 10, 2010

పేదలు నిర్మూలింపబడ్డారు!!!

అద్బుతం అసామాన్యం అప్రతిహతం వగైరా వగైరా విశేషణాలన్నీ సరిగ్గా సరిపోయే సంఘటన ఒకటి ఈమధ్య జరిగింది. అదే...సారాయి దుకాణాల లైసెన్స్ వ్యవహారం. ప్రభుత్వ అధికారులే అదిరిపోయే మొత్తాలని దాఖలు చేసారు మన సారా వ్యాపారులు. వాళ్ళది వ్యాపార దృక్పధం. ఈరోజు సారా లో లాభం ఉంటే సారా అమ్ముతారు. రేపు బూడిద లో లాభం ఉంటే బూడిద అమ్ముతారు. వాళ్ళని ఏమి అనలేం. ఇక ఈ వ్యవహారం లో పాత్రధారులు ప్రజలు, ప్రభుత్వ అధికారులు, రాజకీయనాయకులు మిగిలారు. ఇందులో అసలు సూత్రధారులు ఎవరో తెలుసుకోవడం చాలా కష్టం. ప్రభుత్వ అధికారుల్ని ఎమన్నా అందామంటే....వాళ్ళకి రాజకీయ నాయకుల మీద విపరీతమైన స్వామి భక్తి. ఆ భక్తి పారవశ్యం లో అలా ప్రవర్తించడం తప్పంటారా..?? ముమ్మాటికీ కాదు. ఇక రాజకీయ నాయకుల విషయానికి వస్తే..ఇదేంటండి రాష్ట్రం లో మద్యం వరదలై పారుతుంటే మీరేం చెయ్యట్లేదు సరికదా...దానికి వంత పాడుతున్నారేంటి అని అడిగిన ఒక పాత్రికేయుడికి మన ఎమెల్యే గారు ఇలా శెలవిచ్చారు....
    " పేదలని ఉద్దరించడానికి కోట్ల కొద్ది ధనం వెచ్చిస్తున్నాం. దాని వల్ల అసలు రాష్ట్రం లో పేదలే లేకుండా పోయారు. ప్రతిఒక్కరి దగ్గర కావలసినంత డబ్బు ఉంది. మరి డబ్బు ఉంటే జల్సా చెయ్యాలని అనిపిస్తుంది. అలాగే చేస్తున్నారు. పేదల్ని ఉద్దరించడం తప్పా ??"

అదీ ఇప్పుడు చెప్పండి తప్పని..చూద్దాం. ఇంత తెలివి ఉన్న రాజకీయ నాయకులని మనం తప్పని సరిగా వచ్చే ఎన్నికలలో గెలిపించాలి. ఇదంతా అన్యాయం అంటూ గొంతు చించుకుని వేలం పాట జరిగే చోట అరిచిన,బొత్తిగా లోక జ్ఞానం లేని,  లోక్ సత్తా నాయకులని ఓడించాలి. ఆదాయం తగ్గి పోయి నీరస పడిపోయిన ప్రభుత్వానికి ఏదో ఉడతా భక్తి గా సాయం చేయడానికి చీప్ లిక్కర్ రేటు పెంచితే ఊరికే గోల చేస్తారెందుకో ఈ ప్రజా సంఘాల వాళ్ళు. వీళ్ళకేమి పనీ పాటా ఉండదనుకుంటా. అసలు రేటు పెంచాక దాన్ని చీప్ లిక్కర్ అంటారెందుకో ఈ మతిలేనివాళ్ళు. చివరకి తెలిసోచ్చేదేమిటంటే.........
 రాష్ట్రం లో పేదలు సమూలంగా నిర్మూలిన్చబడ్డారు....
ఎందుకంటే ఎవరూ చీప్ లిక్కర్ తాగట్లేదు..అంతా బ్రాండెడ్ లిక్కర్ మాత్రమే తాగుతున్నారు. 
మరింకేం ఆలస్యం..పేదలందరూ నశించిన ఈ శుభసమయాన ఆనందం గా పాడండి.. మందేస్తూ చిందైరా...చిన్దేస్తూ మందైరా......