Jan 20, 2011

శివుడు శివుడు శివుడు......2


ప్రతీ ఆదివారం ఉదయాన్నే లేచి ఈనాడు పేపర్ ని ఆమూలాగ్రం చదవడం నాకలవాటు. అదే విధంగా ఒక శీతాకాలపు ఆదివారం ప్రభాత వేళ మా ఆవిడ ఇచ్చిన పొగలు కక్కే కాఫీ తాగుతూ ఈనాడు పేపర్ పరవశం తో చదువుతూ ఉండగా.....వీపు విమానం మోత మోగింది. చివాలున తలెత్తి చూసేసరికి ఎదురుగా పళ్ళికిలిస్తూ  నా చిన్ననాటి స్నేహితుడు శివం. 

"ఒరేయ్ శివం...నువ్వా..వీపు వాచిపోయింది...ఇంకెవరైనా అయితే చావబాదేవాడిని"

"నువ్వు నా వీపు బాదుదామన్నా కుదరదు...ఎందుకంటే ఇది చెల్లుకు చెల్లు. నేను higher studies  కి abroad వెళ్లేముందు నన్ను కూడా ఇలాగే బాది, అడిగితే.... తిరిగి వచ్చే దాకా గుర్తు ఉండడానికి అని చెప్పావ్. అప్పటి నుండి ప్రతీకార జ్వాలతో రగిలిపోతున్నా. కన్ను కన్ను, పన్ను కు పన్ను, దెబ్బకు దెబ్బ తీయందే నిద్రపోకు రా అని మా తాత నా దగ్గర మాట తీసుకున్నాడు. ఇన్నాళ్ళకు ఆ మాట నిలబెట్టుకున్నా..." అన్నాడు ఆవేశంగా..

"ఎడిసావ్ లే గాని...నువ్వు అమెరికా వెళ్ళినా ఎం మారలేదు రా, అప్పుడెప్పుడో ఆరేళ్ళ క్రితం నేను కొట్టిన దెబ్బని గుర్తు పెట్టుకుని ఇలా తిరిగి ఇచ్చావంటే ఇంక నిన్నేమనాలి"

"మర్చిపోదామన్నా కుత కుత ఉడికే రక్తం నన్ను మర్చిపోనివ్వదు"

"ఏంట్రా సీమ సినిమాలు ఎక్కువగా చూసావా ఏంటి..."

"ఏదో సరదాకన్నారా...Phd  thesis లో బాగా frustrate అయినప్పుడు కొంచెం relax అవ్వడం కోసం చూస్తా. అంతే తప్ప మామూలు సమయం లో చూడడానికి నాకు ధైర్యం సరిపోదు."

"ఆ గోలకేం గాని....ఎలా ఉన్నావ్? ఎప్పుడు వచ్చావ్?"

"Phd  అయిపొయింది రా,  ఇక్కడ ఇండియా లోనే BARC లో ఉద్యోగం వచ్చింది. ఇంకో నెలలో జాయిన్ అవ్వాలి. "
"congratulations , phd అయినందుకు, జాబు వచ్చినందుకు. మరి పెళ్ళెప్పుడు?"

"ఇప్పుడేగా ఉద్యోగం వచ్చింది. కొన్నాళ్ళు ప్రశాంతంగా ఉండనీ. ఐనా నువ్వు చేసుకున్నావ్ గా ఎం సాధించావ్?" అన్నాడు వెటకారంగా. 

"అదీ నిజమేలే, మా లాంటి బుర్ర తక్కువ వాళ్లకి పెళ్లి గానీ  నీలాంటి తెలివైన వాళ్ళ అవసరం దేశానికి చాలా ఉంది" నేను కూడా వెటకారం గా అన్నా, వాడు మాత్రం చిన్నప్పటి నుండి అన్నింటిలోను ఫస్టే. ఏ విషయాన్నైనా యిట్టె పట్టేసేవాడు. చూసి నేర్చుకో అని మా అమ్మ నన్ను దెప్పుతూ ఉండేది. కాని వాడికి అమెరికా లో phd అవకాశం వచ్చినప్పుడు మాత్రం, నువ్వు బుర్ర తక్కువ వాడివి కాబట్టి సరిపోయింది,వాడిలా తెలివైన వాడివి అయ్యుంటే మమ్మల్ని ఇక్కడ వదిలేసి అలా తుర్రు మని ఎగిరిపోయేవాడివి . మేము ఎమైపోయేవాళ్ళం   అని ఓ రెండు సార్లు ముక్కు చీదింది. నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. 

"అబ్బ చాల్లే ఆపరా..ఇంతకీ నువ్వేం చేస్తున్నావ్?"

"ఏముంది ఊళ్ళో స్కూల్లో లెక్కల మాస్టారుగా పని చేస్తున్న. మా నాన్న తో కలిసి పొలం పనులు చూసుకుంటున్నా...అంతే....నువ్వు చేస్తున్న దాని కన్నా గొప్ప పనేం కాదులే" ఎంతో టాలెంట్ ఉన్నవాడు, టాలెంట్ ని ఎవరూ గుర్తించట్లేదు అని బాధతో చెప్పే గొంతుకతో చెప్పా. 

"చాలు ఆపరా....ఏ పని చిన్నది కాదు..as long as you are happy doing it" వీడికి కొంచెం ఫిలోసోఫి కుడా అబ్బినట్టుంది అమెరికా వెళ్ళాక. 

"సర్లే పద అలా మా పొలంగట్టుకెళ్ళి కబుర్లు చెప్పుకుందాం" 

శివాన్ని మా ఆవిడకు పరిచయం చేసి, ఇంట్లో అందరూ కుశల ప్రశ్నలు అడిగిన తర్వాత బైలుదేరి పొలం గట్టుకు చేరుకున్నాం. 

phd కష్టాలు,  అమెరికా కబుర్లు, మా ఊరి కబుర్లు చాలానే దొర్లాయి మా మధ్య. phd అంటే permanent head damage అంటారని వాడు చెబితే నాకు తెగ నవ్వొచ్చింది. కాని వాడు  అమెరికా గొప్పతనం, ఇండియా వెనకబాటుతనం, అక్కడి కృత్రిమత్వం, ఇక్కడి పల్లెల్లోని ప్రశాంతత, ఇలాటి సోది కబుర్లు ఏమి మాట్లాడకపోవడం నాకు చాలా సంతోషం కలిగించింది. మాటల్లోనే మధ్యాహ్నం అయ్యింది. బలవంతం గా మా ఇంటికి భోజనానికి లాక్కెళ్ళా వాడిని. భోజనం అయ్యాక ఇద్దరం కలిసి వాళ్ళింటికి వెళ్లాం. అక్కడ మేడ మీద వాడి గది లో కూర్చుని మళ్ళీ కబుర్లు మొదలు పెట్టాం.

"ఇంతకీ నువ్వు phd దేనిమీద చేసావ్ రా"

"Development of phonon-polarization THz spectroscopy, and the investigation of relaxor ferroelectrics " 

"phd గురించి అడిగితే తిడతావేంట్రా ..."

"అది నా phd టైటిల్ రా బాబు, తిట్టడం ఏంటి"

"ఓహో టైటిలా అది.....ఒద్దు లేరా తెలుసుకోవాలన్న కోరిక చచ్చిపోయింది"

"సర్లే గాని ఇందాక మాటల మధ్యలో, మన శివాలయం...ఏదో కథ అన్నావ్..ఏంటో చెప్పొచ్చు కదా.."  అసలే నాస్తికుడు, వీడికి దీని మీద ఇంట్రెస్ట్ ఎందుకు పుట్టిందో..??? 

నాకు పూజారి చెప్పిన కథంతా అక్షరం పొల్లు పోకుండా చెప్పా. అంతా ట్రాష్ అని కొట్టి పారేస్తాడనుకున్నా గాని, సీరియస్ గా ఆలోచించడం మొదలెట్టాడు. ఇంతలో ఏదో ఆలోచన వచ్చిన వాడిలా అన్నాడు,
"ఒక పని చేద్దాం, శివాలయం లోనికి వెళ్లి శివలింగం వేడిగా ఉందొ లేదో చూద్దాం, దెబ్బకి తెల్సి పోతుంది కథ నిజమో కాదో"

"ఇంకా నయం,  మనం గర్భగుడి లోకి వెళ్ళడం పూజారి చూస్తే శివ తాండవం చేస్తాడు"

"ఆయన చూస్తూ ఉండాగా వెళ్తామా, అయన లేనప్పుడు వెళ్దాం"

"హలో మాస్టారు, మీకో విషయం తెలుసో లేదో, ఆయనో  పగలస్తామాను గుడిలో ఉంటాడు. ఆయనకు తెలీకుండా వెళ్ళడం చాలా కష్టం"

"అదిగో solution నువ్వే చెప్పావ్, రాత్రిళ్ళు అయన గుడిలో ఉండడు కదా అప్పుడు వెళ్దాం"

"సార్, గుడికి తాళం అనేది ఒకటి ఉంటుంది సార్"

"అయన దగ్గర తాళం దొబ్బేసి, దొంగ తాళం చేయిద్దాం"

"ఒరేయ్ ఇదంతా అవసరమా...."

"ఇక్కడ నెల రోజులు ఎలా టైం పాస్ చెయ్యాలో అర్థం కావడం లేదు. ఇలాంటి కిక్కు ఇచ్చే పని ఒకటి కల్పించుకుంటే  ఇంచక్కా  టైం పాస్ అయిపోతుంది"

"చాల్లే చెప్పావ్, కావాలంటే  నువ్వు చెయ్యి. ఈ తొక్కలో కిక్కు నాకవసరం లేదు" కొంచెం కోపం నటించాను.
ఆ తర్వాత వేరే కబుర్లలో పడ్డాం. మర్నాడు నుంచి నేను మాములుగా నేను స్కూల్కి వెళ్ళడం. వాడు సాయంత్రం వచ్చి కలవడం, లోకాభిరామాయణం మాట్లాడుకోవడం. ఇలా ఒక వారం రోజులు గడిచింది. తర్వాత ఆదివారం మళ్ళీ ఉదయాన్నే  నేను పేపర్ చదువుతూ ఉండగా సైలెంట్ గా వచ్చి ఒక తాళం చెవి నా ముందు పెట్టాడు. 

"ఏంట్రా ఇది"

"మన శివాలయం గుడి duplicate తాళం" తాపీగా చెప్పాడు. 

అదిరిపడ్డాను నేను. "ఎలా సంపాదించావు రా" తమాయించుకొని అడిగాను.

"చండశాసనుడైన మా ప్రొఫెసర్ ల్యాబ్ కీ ఇవ్వనంటే, అయనకి తెలియకుండా duplicate చేయించినవాడిని, ఇదో లెక్కా... "

"రోజూ ఉదయం శివాలయానికి వెలుతున్నావంటే భక్తేమో అనుకున్నా, ఇదన్నమాట సంగతి. మరీ ఇంత సీరియస్ గా తీసుకుంటావనుకోలేదు. ఇంతకీ ఇప్పుడేం చేద్దామంటావ్ ?"

"ఏముంది, ఈరోజు రాత్రి 12  దాటాక నేను వస్తాను, ఇద్దరం కలిసి శివాలయం లో దూరి....."

"ఆపరా బాబు, మా అమ్మకు తెలిస్తే చంపేస్తుంది, అసలే ఆవిడ భీభత్సమైన శివ భక్తురాలు"

"చిన్న పిల్లాడిలా, అమ్మ తిడుతుంది అంటా వేంట్రా...నీకు రావాలనుందా లేదా...ఒక పని చెయ్యి..నీకు భయమైతే రాకు, నేను వెళ్తా.."అని నన్ను కొంత రెచ్చగొట్టడానికి ప్రయత్నించాడు. 

"సర్లే 12 దాటాక కదా...ఎలాగోలా వస్తాలే..." నాక్కూడా తెలుసుకోవాలని ఉంది. ఎం చేసేది మరి?

"నేను మీ ఇంటికి వచ్చి ఫోన్ చేస్తా నీ సెల్ కి, అప్పుడు వచ్చెయ్యి, ఫోన్ vibration mode లో ఉంచు" అని టక టకా చెప్పి చక చకా వెళ్లిపోయాడు. 

నేను స్థాణువు నై చూస్తూ ఉండి పోయాను. కొంచెం తలపోటుగా ఉందని చెప్పి రాత్రి తొందరగా మంచమెక్కాను . నిద్ర పడితే ఒట్టు, ఒకటే కంగారు. అన్నట్టుగానే 12 :30 కి ఫోన్ చేసాడు. అడుగులో అడుగు వేసుకుంటూ చడీ చప్పుడు చెయ్యకుండా ఇంట్లోంచి బైట పడ్డాను. వాడేం మాట్లాడకుండా శివాలయానికి దారి తీసాడు. వాడి వెనకాలే నేను కూడా బైలుదేరాను. శివాలయం కూతవేటు దూరం లో ఉందనగా ఎక్కడినుండో కుక్క అరుపు వినపడుతోంది. అది అరుపు లా లేదు మూలుగుకి ఊళ కి మధ్యలో ఉంది. గుండె ఝల్లుమంది. ఒక్కపరుగు లో శివం గాడిని చేరుకొని, " కుక్క అలా అరిస్తే అనుకున్న పని అవ్వదంట, వెనక్కి వెళ్ళిపోదాం పదరా....". "nonsense " అని ఇంక వేగంగా నడవడం మొదలెట్టాడు. ఎం చెయ్యాలో అర్థం కాక వాడినో రెండు తిట్లు, వాడితో వచ్చినందుకు నన్నో రెండు బూతులు తిట్టుకుని వాడిని అనుసరించాను. 

చప్పుడు చెయ్యకుండా నెమ్మదిగా వెనకాల గోడ నుండి లోపలికి దూకాం. గుడి మూడు గదులుగా నిర్మించారు. లోపల గది లో లింగం ఉంది. ఆ గర్భగుడి కి రెండో గదికీ మధ్య గుమ్మం దగ్గర గొలుసులు బిగించి ఉంటాయి. ఆ  గది లోంచే హారతి నైవేద్యం ఇస్తూ ఉంటాడు పూజారి. మూడో గది లో భక్తులకి తీర్థ ప్రసాదాలు అవీ ఇస్తూ ఉంటాడు. మూడో  గది ఎప్పుడూ తీసే ఉంటుంది. ఇప్పుడు మా దగ్గర ఉంది మూడో  గదికీ రెండో గదికీ ఉన్న తాళానికి చెవి. 
ఆ గది తాళం తీస్తూ అడిగాడు శివం, "ఎలా ఉంది కిక్కు?"

"కిక్కు బొక్కలా ఉంది, నరాలు తెగిపోతున్నై, హార్ట్ ఎటాక్ వచ్చి చచ్చిపోయేలా ఉన్నా" ఎగదన్నుకుంటూ వస్తున్న ఆవేశాన్ని  ఆపుకుంటూ చెప్పా. 

"గుడ్, అదే నాకు కావాల్సింది" అని తాళం తీసి, నెమ్మదిగా తలుపు తోసాడు. కిర్రు మనే శబ్దం చెయ్యకుండానే తలుపు తెరుచుకుంది. 

లోపల ఒక చిన్న దీపం నుండి వచ్చే కాంతి తప్ప ఇంకేం కనపడడంలేదు. పక్కనున్న గోడ మీద స్విచ్ బోర్డు అస్పష్టంగా  కనపడింది. నేను వెళ్లి లైట్ వెయ్యబోతే, గభాలున నన్ను చెయ్యి పట్టుకుని వెనక్కి లాగాడు. పడబోయి నిలదోక్కుకున్నాను. నేను ఏదో అనబోయే అంతలోనే జేబు లోంచి టోర్చ్ లైట్ తీసి ఆన్ చేసాడు. "ఇలాంటి పనులకి ఇదే కరెక్ట్" అని గర్భగుడికి అడ్డంగా ఉన్న గొలుసుల దగ్గరకు నడిచాడు. ఆ గొలుసుల లోంచి లోపలి ఎలా వెళతాడో నాకు అర్థం కాలేదు. అడుగున ఉన్న గొలుసు మధ్యలో cutting plier తో కట్ చేసాడు, అలా చెయ్యడంతో కింద పడుకుని పాకి లోపలి వెళ్ళే అంత ఖాళీ ఏర్పడింది. మళ్ళీ ఎలా అతికిస్తావ్ రా అని నేను అడగబోయే లోపల, జేబులోంచి ఒక చిన్న అయస్కాంతం తీసాడు. అది కట్ చేసిన చోట పెట్టగానే గొలుసు  అతుక్కుని, కొంచెం దూరం నుంచి చూస్తే మాములుగానే కనిపిస్తుంది. అర్థం అయ్యిందా అన్నట్టు నా వంక చూసాడు. అయ్యిన్దన్నట్టు తలూపాను. అయస్కాంతం తీసుకుని జేబులో వేసుకుని, గొలుసు విడగొట్టి, కింద నుంచి పాకి లోపలి చేరుకున్నాడు. నేనుకూడా అలాగే పాక్కుంటూ లోపలి వెళ్లాను. 

లోపల నేను ఊహించిన దానికన్నా చాలా భిన్నంగా ఉంది. పైన ఎక్కడా బూజులు లేవు. నేలంతా శుభ్రంగా అప్పుడే తడి ఆరినట్టుగా ఉంది. రోజూ పూజారి నీళ్ళు పోయడం వాళ్ళ అనుకుంటా. లింగం దగ్గర నుండి చూస్తే చాలా విచిత్రంగా ఉంది. లింగం ఉపరితలం అంతా తేనెపట్టు మీద ఉండే pattern చెక్కినట్టు ఉంది.   ఆకారం మాత్రం చెక్కినట్టు లేదు, ఒక పెద్ద రాయిని పట్టుకుని ఇష్టం వచ్చినట్టు బాదేస్తే, పొరపాటున కొంచెం శివ లింగం ఆకారం వచ్చినట్టు ఉంది.
"ఇప్పుడు చూడు, నువ్వు చెప్పిన కథ నిజమే కాదో తేలిపోతుంది..." అంటూ లింగం మీద చెయ్యి వేసి.......మాట్లాడకుండా ఉండిపోయాడు.
"ఏంట్రా ఎం మాట్లాడవేంటి?" అంటూ నేను కూడా లింగం మీద చెయ్యి వేసా. లింగం వేడిగా ఉంది.