Oct 25, 2010

శివుడు..శివుడు...శివుడు..

 
మా ఊరు శివాలయం అంటే నాకు ఎందుకో చెప్పలేనంత ఇష్టం. అక్కడికి వెళ్ళగానే కలిగే ప్రశాంతత...ఆ అనుభూతి మాటల్లో చెప్పలేనిది. మా ఇంటికి దగ్గరలోనే వెంకన్న గుడి ఉన్నా, అక్కడికి వెళ్ళడం పెద్దగా ఇష్టం ఉండదు నాకు. వెంకన్న గుడిలో ఉదయం సాయంత్రం అని లేకుండా ఎప్పుడూ జనం ఉంటూనే ఉంటారు. దాంతో పాటు ఎప్పుడూ ఏదో ఒక భజన, లౌడ్ స్పీకరు మొదలైనవాటితో ప్రశాంతత మాట అటుంచి పిచ్చెక్కకుండా ఉంటే చాలు అనిపిస్తుంది. పైగా విష్ణువు అలంకార ప్రియుడని చెప్పి ఊర్లో ఉన్న పూల మొక్కల మీద ఉన్న అందమైన పూలన్నే పీక్కొచ్చి మరీ అలంకరిస్తారు. శివుడికి అలాంటివన్నీ ఇష్టం ఉండదు అని చెప్పి ఆ విధ్వంసాన్ని అక్కడితో ఆపారు, సంతోషం. ఇదంతా చూసి వీడెవడో తీవ్రమైన శైవుడిలా ఉన్నాడు అని మీరు అనుకోవడంలో తప్పులేదు. మానవ జాతి నాశనం అవ్వడానికి ఉన్న మత చాందస వాదం,  ప్రాంతీయవాదం, కులగజ్జి, మొదలుగాగల వ్యాధులు చాలు, కొత్తగా నేనేం తిరిగి సృష్టించబోవడం లేదు. ఇక్కడ నేను చెబుతున్నది గుడికో, చర్చికో, మసీదుకో  వెళ్ళినప్పుడు కలగాల్సిన ప్రశాంతత గురించి తప్ప ఏ చాందసం గురించి కాదు. ఇంక అసలు విషయానికొస్తే, ఆ కారణాలవల్ల మా ఊళ్ళో శివాలయం అంటే నాకు చాలా ఇష్టం. మా ఊళ్ళో శివాలయం చాలా పురాతనమైనది. ఎప్పుడు కట్టారో ఎవరు కట్టారో చెప్పే శాసనాలేమీ అందుబాటులో లేవు. గుడి లోని శిల్ప కళ  చాల అధ్బుతంగా  ఉంటుంది. కానీ ఎందుకు ప్రాచుర్యం పొందలేదో   నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఆ గుడికి సంబంధించి ఒక కథ కూడా ఉంది. అది కూడా చాలా మందికి తెలియదు. అ గుడి పూజారి ని తరచి తరచి అడగ్గా, తనుకూడా మర్చిపోయాడనుకుంటా, అలోచించి ఆలోచించి చెప్పాడు. ఆ కథ ఏమనగా......

చాలా కాలం కిందట వల్లభుడు అనే రాజు ఇప్పుడు మేమున్న ప్రాంతాన్ని పరిపాలించేవాడు. ఆయన పరమ నాస్తికుడు. భక్తుడు అనే వాడు ఎవడైనా కనిపిస్తే చిత్ర హింసలు పెట్టి చంపేవాడు. ఒక రోజు పరమ శివ భక్తుడైన ఒక రుషి పట్టణం లో భిక్షాటన చేస్తూ వల్లభుడి కంట పడ్డాడు. నుదుట విభూది రేఖలు కనపడగానే వల్లభుడికి పట్టరాని కోపం వచ్చింది. వెంటనే ఆ ఋషిని తన కోటకి లాక్కెళ్ళి కోట గుమ్మం వద్ద తలకిందులు గా వేల్లాడకట్టాడు. తనకు శివుడిని చూపించమని అరుస్తూ ఋషిని హింసించడం మొదలెట్టాడు. దానికి రుషి, రాజా నువ్వు కళ్ళుండీ గుడ్డి వాడిలా ప్రవర్తిస్తున్నావ్, భక్తి తో చూస్తే   నీకు అంతటా శివుడే కనపడతాడు అన్నాడు. అయితే తనకు తెల్లవారే సరికి శివుడు కనపడకపోతే, వచ్చి శిరస్చేదం  చేస్తానని బెదిరించి, ఋషిని అలాగే వదిలేసి, తన అంతఃపురానికి చేరుకుంటాడు. ఆ రాత్రి ఉరుములు మెరుపులతో భయంకరమైన వర్షం కురుస్తుంది.   తెల్లవారుతుంది అనగా దిక్కులు పిక్కటిల్లెంత శబ్దం, భూకంపం వచ్చినట్టు కోటంతా కంపిస్తుంది. భయం తో రాజు కోటలోంచి బయటకు పరుగులు తీస్తాడు. అక్కడ బయట కనిపించిన దృశ్యం చూసి కొయ్యబారి పోతాడు. దాదాపు శివలింగాకారంతో శిల ఒకటి , అగ్ని పర్వతం లోంచి అప్పుడే బయటకు వచ్చిందా అన్నట్టు ఎర్రగా కాలిపోతూ కనిపిస్తుంది. గడగడా  వణికిపోతూ రాజు రుషి వద్దకు పరుగులు తీస్తాడు. అపస్మారక స్థితి లో ఉన్న రుషికి వైద్యుల చేత తగిన సపర్యలు చేయించిన తర్వాత, రుషి కాళ్ళ మీద పడి  తన తప్పుకు ప్రాయశ్చిత్తం చెప్పమని వేడుకుంటాడు.  అప్పుడు ఆ రుషి, శివుడిని శాంతింప చేయాడానికి యజ్ఞ యాగాదులను నిర్వహించాలని, ఆ  శివలింగానికి అభిషేకాలు నిర్వహించాలని ఆదేశించాడు. ఎన్ని నీళ్ళతో అభిషేకాలు చేసినా, పోసిన నీరు పోసినట్టు ఆవిరవ్వడం తప్ప వేడి  ఏ  మాత్రం తగ్గలేదు. ఇక చేసిది లేక రాజు ఆ లింగం చుట్టూ గుడి కట్టించి, రోజూ క్రమం తప్పకుండా అభిషేకాలు చేయించసాగాడు. ఆ రాజు వయసు మళ్ళి మరణించే సమయానికి కూడా వేడి చల్లారక పోవడంతో ఆ వేడి తగ్గే వరకూ అలా అభిషేకాలు చేస్తూ ఉండమని తన కొడుకులని ఆదేశించి మరణించాడు. ఆ తర్వాత రాజులందరూ అభిషేకాలు క్రమం తప్పకుండా చెయ్యగా చెయ్యగా కొన్ని వందల సంవత్సరాల తర్వాత వేడి తగ్గి ఇప్పుడు ఉన్న స్థితికి వచ్చిందంట. అది కథ.
ఎవరో గాని...కథ బాగా అల్లారు అనిపిస్తోంది కదా...సరిగ్గా నాకు అలానే అనిపించింది. కానీ ఇక్కడ ఒక ఆసక్తి కరమైన విషయం ఉంది. సదరు వల్లభుడనే రాజు ఆ ఆలయం గర్భగుడిలోకి ఎవరూ వెళ్ళరాదనే   శాసనం కూడా చేసాడు.  అందుకని గర్భగుడి తలుపు తీసేయించి  అడ్డంగా గొలుసులు కట్టించాడు. చెరసాలలో ఉన్న ఖైదీ ని చూడాలంటే ఊసల మధ్య నుండి ఎలా చూడాలో, ఆ లింగాన్ని చూడాలంటె గొలుసుల మధ్యలోంచి అలా చూడాలన్నమాట. గుడి గోపురం పై భాగం లో నీళ్ళ తొట్టి లాంటి దొకటి కట్టించి, రోజూ దాన్ని నింపాల్సింది గా శాసనం చేసాడు. ఎలా వస్తుందో తెలీదు గాని, ఆ నీరు సన్నని ధారలాగ లింగం మీద పడుతూ ఉంటుంది. ప్రస్తుతం ఆ నీళ్ళతొట్టిని నింపే  పని పూజారి నిర్వహిస్తున్నాడు. గర్భగుడి బైట నుండే పూజాదికాలు జరుగుతుంటాయి. ఈ సంప్రదాయం కనీసం ఒక వంద సంవత్సరాల నుండి జరుగుతుంది అనుకున్నా, గర్భగుడి అంతా దుమ్మూ ధూళి తో నిండి ఉండాలి. ఎప్పుడూ నీరు పడుతూనే ఉంటుంది కాబట్టి అంతా నాచు లాంటిది పట్టు ఉండాలి. కాని ఆశ్చర్యకరంగా  అంతా అప్పుడే చిమ్మినట్టు ఎంతో శుభ్రంగా ఉంటుంది.  వంద సంవత్సరాల దాక ఎందుకు, నా చిన్నప్పటి నుండి అంటే ఒక పాతిక సంవత్సరాల నుండి చూస్తూనే ఉన్నా. ఎప్పుడూ అశుభ్రం గా ఉండదు. అంతా ఆ దేవుడి మహిమ అనుకోవడం తప్ప ఇంకే రకమైన కారణం కనపడలేదు నాకు. ఇన్నాళ్ళూ ఆ రహస్యాన్ని కనుక్కోవాలన్న నా కోతూహలాన్ని వాయిదా వేసుకుంటూ వచ్చా. కానీ అనుకోకుండా నేను ఎదురుచూస్తున్న అవకాశం రానే వచ్చింది.................

~~~~సశేషం~~~~~