Aug 20, 2012

జులాయి

గమనిక:
ఈ కథ లొని పాత్రలు కేవలం కల్పితం. బ్రతికున్న లేక మరణించిన మనుషులతో ఈ కథ లోని  పాత్రలకు సంబంధం ఉన్నట్టు అనిపించడం కేవలం యాదృచ్చికం 

               ఒక చల్లని సాయంత్రం. ఆకాశం అంతా మబ్బులు కమ్మి ఉన్నాయి. నీరసంగా ఆఫీసు నుండి వచ్చిన నన్ను చూసి మా అవిడ ఫక్కున నవ్వింది. ఆ నవ్వు చూసి కొపం వచ్చినా, మనోహరమైన ఆ నవ్వు చూసి కొంచెం మనస్సు ప్రశాంతంగా అనిపించింది. నా పరిస్థితి అర్ధం చేసుకొని చప్పున కాఫీ తెచ్చి ఇచ్చి, లాప్ టాప్ లో నాకిష్టమైన " ఓ మధు...ఓ మధు....." పాట పెట్టింది. పాట అయ్యేసరికి మామూలు మనిషినయ్యాను.  

"ఏమైనా డార్లింగ్, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం కేక. అసలు ఈ సాంగ్ వెండి తెర మీద చూడాలి. మూవీ రాగానే గుర్తు చెయ్యి, టికెట్స్ బుక్ చేస్తా" అన్నాను అవేశంగా. 

"రేపు రిలీస్ అవుతుందని నిన్న చెప్పాను మీకు" తాపీగా చెప్పింది శ్రీమతి. "ఈరొజే రిలీస్ అయిపొయిందా!!! మళ్ళీ ఇంకొసారి ఈరోజు ఉదయం గుర్తు చెస్తే నీ సొమ్ము ఎమన్నా పొతుందా?" టికెట్స్ దొరకవేమో అని కొపంతో కూడిన ఆందొళన.

"ఈరోజు కాదు....రేపు రిలీస్" నింపాదిగా చెప్పింది.

"మరి ఇందాక ఈరోజు అని చెప్పావ్" అన్నాను కరవడానికి సిద్ధమవుతూ.

"రేపు అంటే ఈరోజుకి రేపు, నిన్నకు  ఎల్లుండి" అదే నిదానం.

"నా వల్ల కాదే , నా వల్ల కాదు. ఈమధ్య నిన్నేమన్నా అంటే క్షమించవే. దయ చేసి సరిగ్గా చెప్పు. జులాయి మూవీ ఎప్పుడు విడుదల అవుతుంది" ప్రాధేయపడుతూ అడిగా.

"రేపు"   

"హమ్మయ్య, సరే ఐతే. ఇప్పుడే వెళ్ళి టికెట్స్ బుక్ చేస్తా."