Apr 11, 2011

నాకే ఎందుకు జరుగుతుంది?


నాకే  ఎందుకు  జరుగుతుంది?.............ఒక  మనిషి  ఎలాంటి  పరిస్థితుల్లో  ఈ ప్రశ్న వేసుకోవచ్చు??
1.      అనుకోకుండా, కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలినప్పుడో.
2.      దగ్గరి  వాళ్ళెవరన్నా చనిపోయినప్పుడో.
3.      ప్రియుడు/ప్రియురాలు  మోసం  చేసినప్పుడో.
4.      అనుకున్నది  దక్కనప్పుడో .
5.      ...................................
6.      ...................................
ఇలా  సవాలక్ష  కారణాలు  ఉండొచ్చు. 

ఎప్పుడు  వేసుకున్నా ....కష్టాల్లో  ఉన్నప్పుడు  కాకుండా, సుఖాల్లో  ఉన్నప్పుడు  ఈ  ప్రశ్న  ఎవరైనా వేసుకుంటారా??
కొత్త  బైక్ ................నాకే  ఎందుకు?
కొత్త  laptop ...........నాకే  ఎందుకు? 
ఉద్యోగం .................నాకే  ఎందుకు?
ప్రమోషన్  ..............నాకే  ఎందుకు?
విదేశి  ప్రయాణం......నాకే  ఎందుకు? 
 ................................................................................

అసలు ఆ ప్రశ్న నాకు ఎప్పుడు  వేసుకోవాల్సి వచ్చింది అంటే.................


                        మొన్నామధ్య  ఊరెళ్ళడానికి రైల్వే స్టేషన్ కి వెళ్ళినప్పుడు ట్రైన్  రెండు గంటలు లేట్ అని తెలిసింది.  నాకే ఎందుకు? అని అనుకుంటూ ఉండగా  ఒక  విచిత్రమైన  దృశ్యం  కనపడింది. ఇప్పటి  వరకు  నేను  ఎప్పుడు  అటువంటిది  చూడలేదు. ప్లాట్ ఫారం  మీద  ఆ  చివరనుండి  ఈ  చివరదాకా   క్యులో  నిలబడి  ఉన్నారు  జనం. అందులో  వింతేముంది, టికెట్స్  కోసం  అయిఉంటుంది  అంటారా.... టికెట్స్  కోసం  అయితే  అంత  ఆశ్చర్యం  ఏముంది. టికెట్స్  కోసం  కాదు వాళ్ళు క్యులో నుంచుంది , రైల్  ఎక్కడానికి. రైల్  ఎక్కడానికి  క్యు!!! అబ్బ!!! దేశం  చాలా  అభివృద్ధి  చెందుతోంది  అని  అప్పుడే ఆనందపడకండి . ఆ  క్యు కి  అటూ  ఇటూ  నిలబడి  ఒక  పాతికమంది  పోలీసులు  జనాల్ని  అదుపు  చేస్తున్నారు. ఆ  పోలీసులకి  రాక  రాక  వచ్చిన  అవకాశం  లాగా ఉంది . తెగ  జులుం   ప్రదర్శిస్తున్నారు. అక్కడక్కడా  కొడుతున్నారు  కూడా.  ఇదంతా  చూసి  ఏమైనా  ఖైదీలేమో? ఒక  జైలునుండి   ఇంకో  జైలుకి  తరలిస్తున్నారేమో  అనుకున్నా. కాని  వాళ్ళెవరూ  ఖైదీ  డ్రెస్ లో  లేరు. అందరి  చేతుల్లోనూ  పెద్ద  పెద్ద  మూటలు,  సామాను  అవీ  ఉన్నాయ్. ఆపుకోలేక  వెళ్లి  ఆరా  తీయగా తెలిసింది ఏమిటంటే, వాళ్ళంతా   Aazad Hind Express లో  జనరల్లో  ఎక్కడానికి  వచ్చిన   వాళ్లంట. అంతకు  ముందు  ఎప్పుడో  ఆ  ట్రైన్  ఎక్కడానికి  జరిగిన  తోపులాటలో  కొంతమంది  చనిపోయారంట. అందుకని  అప్పటి  నుండి  అలా  ఏర్పాటు   చేసారంట. ట్రైన్  ఎక్కడానికి  కొట్టుకు  చచ్చిపోవడం  బహుశా   మన  దేశంలో  తప్ప  ఎక్కడా  జరగదేమో. 

                   వచ్చి కనపడిన  బెంచ్  మీద  కూర్చున్నాను. క్యులో  అందరూ  సామాను  ఎత్తుకు  నిలబడి  ఉన్నారు. ముసలి, ఆడ,  మగ, పిల్లా,  జెల్లా  అన్న  తేడా  లేకుండా. అందరి  చేతుల్లోను, నెత్తిమీద  ఏదో  ఒకటి  ఉంది. ఇంకా  వాళ్ళ  ట్రైన్  రావడానికి  15 min ఉందని  అనౌన్స్  చేసారు. అప్పటిదాకా  ఆ  మోత  బరువు  ఎందుకు? దించి  కొంచెం  రిలాక్స్   అవ్వొచ్చు  కదా  అన్న  నా  సందేహానికి  సమాదానం  వెంటనే  దొరికింది. ఒకడు  కిందకి  దించి  నిలబడ్డాడు. పోలీసు   ఒకడు  వచ్చి, పెడేల్మని లాటీతో  ఒకటి  ఇచ్చాడు. సామాను  ఎత్తుకు  నిలబడమని, హిందీ లో నాలుగు బూతులు వదిలాడు. వాడు చప్పున ఒక చేత్తో సామాను ఎత్తుకుని, రెండో చేత్తో  దెబ్బని నిమురుకోసాగాడు . వాడు  హిందీలో  తిట్టిన తిట్ల బట్టీ నాకు అర్థమయింది ఏమిటంటే, ట్రైన్ రాగానే అందరూ సామాను ఎత్తుకోవడం మొదలెడితే, అసలే ఒకరి మీద ఒకరు ఉన్నారు, కొంత మంది కింద పడిపోయి తొక్కిసలాట జరిగే అవకాశం ఉంది. అందుకని ట్రైన్  వొచ్చేదాకా  ఆ  మోత తప్పదు. 
                      ఇంతలో సడన్ గా హడావిడి మొదలయ్యింది. ట్రైన్ వస్తున్నట్టుంది. ఒక  పోలీసు వచ్చి, క్యులో  సగం నుండి అందరినీ వెనక్కి తిరగమన్నాడు . కొంతమంది  తిరిగారు. అర్థం కాక కొంతమంది  దిక్కులు చూస్తుంటే, రెండు దెబ్బలు పడ్డాయి . దాంతో సగం  క్యులో  ఉన్న జనం వెనక్కి  తిరిగారు. నాకూ అర్థం కాలేదు ఏం జరుగుతోందో. ట్రైన్  వచ్చాక అర్థం  అయ్యింది. దానికి ఉండే జనరల్ బోగీలు, ఒకటి   ముందు, ఒకటి  వెనక ఉన్నాయ్. సగం జనాన్ని ముందుకి, సగం  జనాన్ని  వెనక్కి సర్దుబాటు చేసారన్నమాట. పోలీసులు జనాల్ని లోపలికి గెంటుతున్నారు , బైటకు లాగుతున్నారు, ఏం  జరుగుతుందో ఎవడికీ అర్థం  కావడం లేదు . మొత్తానికి   తొక్కిసలాట  జరగకుండా ఎక్కేసారు. బోగీ దగ్గరికెళ్ళి చూస్తె లోపల మనిషికీ మనిషికీ   మధ్య అసలు గ్యాప్ లేదు. ఆఖరికి lavatory లో  కూడా కూర్చున్నారు. అంత చిన్న lavatory లో  ఆరుగురు ఉన్నారు. బాగా బలిసిన మగాళ్ళు కొంత  మంది  కూర్చుని ఉన్నారు. ఆడవాళ్ళూ , కొంతమంది ముసలి వాళ్ళూ నిలబడి ఉన్నారు. రకరకాలుగా  ఉన్నారు. ఆ ట్రైన్  మహారాష్ట్ర లోని పూణే నుండి, వెస్ట్ బెంగాల్ లో  ఉన్న  కలకత్తాకు వెళ్తుంది. వాళ్ళని చూస్తే  అక్కడికి వెళ్ళే వాళ్ళలాగే ఉన్నారు. చాలావరకు వలస కూలీలు. అంత  మంది  జనం  రోజూ ఎక్కుతున్నారని తెలిసి, ఇంకొన్ని జనరల్  బోగీలు  ఎందుకు వెయ్యరో???....... ట్రైన్  భారంగా  కదిలి, నెమ్మదిగా వెళ్ళిపోయింది.

ఇంతలో నేను ఎక్కాల్సిన ట్రైన్ వచ్చింది. సామాను తీసుకుని ట్రైన్ ఎక్కి, AC first class లో  కూర్చుని , నేను  వేసుకున్న ప్రశ్న .................................... నాకే ఎందుకు????

No comments:

Post a Comment