Jan 14, 2012

బుస్స్ మాన్

 నేను  మహేష్  ఫ్యాన్ ని. బుస్స్ మాన్ సినిమా చూసి కలిగిన ఆనందాన్ని ఎవరితో పంచుకోవాలో తెలియక ఇక్కడ వెళ్లగక్కుతున్నాను.

ప్రతీ మహేష్  సినిమాలాగానే ఈ సదరు "బుస్స్ మాన్" అనే చిత్ర రాజం భయంకరమైన expectations  తో విడుదల అయ్యింది. రెండు రోజుల ముందే టికెట్ బుక్ చేసుకుని, సగటు తెలుగు సినిమా ప్రేక్షకుడిలా బుద్దిగా వెళ్లి పావుగంట ముందు సీట్ లో కూర్చున్నా. సినిమా లో సన్నివేశాలన్నీ  ముంబై లో జరుగుతున్నాయి  కదా, మరి ఇదేంటి అందరూ తెలుగులో మాట్లాడుతున్నారు అని అనుమానించే నాలాంటి బుర్ర తక్కువ వాళ్ళకి సమాధానంగా "ఈ సినిమాలోని సంఘటనలన్నీ ముంబై లో జరిగినా మన సౌలభ్యం కోసం అంతా తెలుగులోనే మాట్లాడుతారు" అని పూరి  గారు ముందే ప్రకటించారు. పర్లేదు నాలాంటి తింగర  ప్రేక్షకులకు కలిగే అనుమానాలు ముందే ఊహించి క్లియర్ చేసారంటే, ఈసారి పూరి  గారు ఇంకో అద్భుతాన్ని అవిష్కరించబోతున్నారు అని నమ్మకం కలిగింది. సినిమా మొదలయ్యింది.......



మహేష్  ముంబై వచ్చాడు. ఎందుకు వచ్చాడు? ఇప్పుడే ఎందుకు వచ్చాడు? ఇన్నాళ్ళూ ఎం చేసాడు?.................
లాంటి ప్రశ్నలు అడక్కండి. అడిగినా మీకు మొదటి  ప్రశ్నకు మాత్రమే సమాధానం దొరుకుతుంది. ఉచ్చ పోయించడానికి వచ్చాడు. ఒకవేళ మనం మర్చిపోతామేమోనని సినిమా అయ్యే దాక వీలు చిక్కినప్పుడల్లా ఉచ్చ పోయించడానికి వచ్చా.....పోయించడానికి వచ్చా...అని  సినిమా అయ్యే దాక గుర్తు చేస్తూనే ఉన్నాడు.మిగతా అనుమానాలు  ఎవరికి వారు సినిమా అయ్యాక పూరి  గారిని కలుసుకుని నివృత్తి చేసుకోవాలని మనవి.

కొంచెం సేపు సినిమా  ఆసక్తి గానే సాగుతుంది. సినిమా అన్నాక హీరో ఉండాలి,  హీరో అన్నాక హీరోయిన్ ఉండాలి కాబట్టి కాజల్ తెర మీదకి వస్తుంది. ఆ కాజల్ కి ఒక ఫ్రెండ్ ఉంటుంది. అది మాట్లాడే తెలుగు ఉంటుంది.....ఆహా...ఆ భగవంతుడు కళ్ళకే కాకుండా, చెవులకు కూడా రెప్పలు లాంటివి ఇచ్చుంటే ఎంత బాగుండేది అనిపించింది. మహేష్ బాబుకి కాజల్ కి మధ్య జరిగే లవ్ ట్రాక్ దాదాపు పోరికి  లాగానే ఉంటుంది. 

సంగీతం అంత  గొప్పగా ఏమి అనిపించలేదు. సార్ వస్తార..పాట పల్లవి తప్ప మిగతా పాట  అంత బాలేదు. పాటల్లో స్టెప్పులు అయితే బ్రహ్మాండం. డాన్సు డైరెక్టర్ సూపర్ స్టార్ కృష్ణ ఫాన్ అనుకుంటా. స్క్రీన్ మీద కృష్ణ గారిని చూపించాడు. 

 కేవలం ఉచ్చ పోయించే కార్యక్రమమే కాకుండా, ప్రేక్షకులకి బూతులు నేర్పించే బాధ్యత  కూడా  బాబు మీద పెట్టడం, ఆ బాధ్యతని  మహేష్  కూడా  చక్కగా నిర్వర్తించడం చాలా ముచ్చటగా అనిపించింది. తెలుగు సినిమాలో ఐటెం సాంగ్ లేకపోవడమేంటి, సినిమా లో ఇక్కడే ఎక్కడో ఉండాలే.....అని వెదుకుతున్న నాకు చెంప చెళ్ళు మనిపిస్తూ తెర మీద ప్రత్యక్షమయ్యింది ఐటెం సాంగ్. ఆవిడెవరో గాని పాపం బాగానే ఒళ్ళు ప్రదర్శించింది. పాత సినిమాల్లో ఎవరైనా తెర మీద బట్టల్లేక ఇబ్బంది పడుతుంటే, సెన్సారు వాళ్ళు పాపం కష్టపడి కట్ చెయ్యడమో లేక తెర మీద అచ్చాదనగా నల్ల రంగు పులమడమో చేసేవాళ్ళు. ఈమధ్య అలాంటిది చూడలేదు. ఈ సినిమా లో సెన్సార్ వాళ్ళు చేసారో, పూరి  గారు చేసారో తెలియదు గాని, ఆచ్చాదన లేని భాగాలను  బ్లర్ చెయ్యడం ద్వారా మళ్ళీ కొత్త ఒరవడిని సృష్టించారని మాత్రం చెప్పగలను.

మహేష్  అక్కడక్కడ కామెడీ చేసాడు గాని ఈ సినిమాలో వేరేగా కామెడీ ట్రాక్ ఏమిలేదు. అది నాకు నచ్చలేదు. అరె...... సినిమా అంటే కథకు సంబంధం లేకుండా వేరే కామెడీ ట్రాక్ ఉండాలి అన్న కనీస జ్ఞానం లేకుండా పూరి  గారు అంత  గొప్ప డైరెక్టర్ ఎలా అయ్యారో నాకు అర్థం కావడంలేదు. ఒక వేళ తెలిసినా వెరైటీ కోసం ప్రయత్నించారేమో తెలీదు.

ఏది ఏమైనా...
1 .      మహేష్ బాబు కనిపించినవాడినల్లా చితక్కొట్టేయ్యడం. 
2 .      కథలో పెద్దగా లాజిక్ లేకపోవడం. 
3 .      ఐటెం సాంగ్ లో ఆవిడెవరో  చేసిన అద్భుతమైన అభినయం 
4 .       హీరోయిన్ కి పెద్దగా క్యారెక్టర్ లేకపోవడం. 
5 .      మహేష్ బాబు లాంటి పెద్దమనిషి ఉచ్చ పోయించడం, బూతులు నేర్పించడం 
6 .      పూరి జగన్నాథ్ గారు చేసిన  బీప్ లు , బ్లర్ లు

మొదలైన కారణాల వల్ల నాలాంటి సగటు తెలుగు సినిమా ప్రేక్షకుడికి నచ్చి హిట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయ్.
అదే విధంగా...........
1 .   వేరేగా కామెడీ ట్రాక్ లేక పోవడం 
2 .   ప్రత్యేకంగా విలన్, వాడికో అనుచరగణం, వాంప్ లాంటి క్యారెక్టర్ లేకపోవడం. 
3 .   ఐటెం సాంగ్ బాగోకపోవడం 
4 .   సినిమా నిడివి కనీసం రెండు గంటల ముప్పై నిముషాలు లేకపోవడం. 
మొదలైన కారణాల వల్ల దరిమిలా ఫ్లాప్  అయ్యే అవకాశం కుడా ఉంది.  



1 comment:

KP moksha said...

Super review !! :D

Post a Comment