Jun 29, 2010

లెక్కల్లో.. జనాభా లెక్కలు వేరయా..4

ఆ రోజు సోమవారం. సోమవారం స్కూల్ కి వెళ్ళడమే అసలు ఒక  నీరసం, అది కాకుండా వచ్చే వారం  నుండి జనాభా లెక్కల కోసం ఊరూరా తిరగాలి.  ఆ ఆలోచన రాగానే తలంతా గాలి తీసేసిన బుడగలా అయిపోయింది. ఈసురూమంటూ..ఎందుకొచ్చిందిరా భగవంతుడా అంటూ......కాళ్ళీడ్చుకుంటూ స్కూల్ కి వెళ్ళా. కొన్ని  రోజుల కిందట నాకో అద్భుతమైన ఆలోచన వచ్చింది. ఒక వారం రోజులు సిక్ లీవ్ పెట్టేస్తే ఎలా ఉంటుందని. నాకెప్పుడు ఒంట్లో బాగోపోయినా నేను తప్పకుండా స్కూల్ కి వెళ్తాను.  ఊరికే సిక్ లీవ్ వృధా అవ్వడం నాకు ఇష్టం ఉండదు. తుమ్ముతూ.. దగ్గుతూ.. ముక్కుతూ... మూలుగుతూ స్కూల్ లోనే గడిపేస్తాను. అలాంటిది ఇప్పుడు సిక్ లీవ్ పెడితే.. అదీ వారం రోజులు... నమ్ముతారా అన్న అనుమానం కూడా కలిగింది. సరిగ్గా ఈ రోజుకి పది రోజులు ముందు "బడి బాట" అని చెప్పి స్కూల్ మానేసిన మా ఊర్లోని మురికి వాడల్లోని పిల్లల్ని తిరిగి స్కూల్ లో చేరిపించే కార్యక్రమం ఒకటి జరిగింది. దానికి వెళ్ళడానికి పేర్లు ఇమ్మని మా హెడ్ మాస్టారు గారు ఉపాధ్యాయులందర్నీ అడిగారు. క్రితం సంవత్సరం ఇలాంటిదే ఏదో కార్యక్రమం లో అక్కడికి వెళ్ళిన మా తెలుగు మాస్టారుకి  విరేచనాలు పట్టుకుని ఓ నెల రోజులు సెలవెట్టాడు. ఆ అదృష్టం నన్ను వరించకపోతుందా అన్న ఆశతో నేను వెళ్తానని చెప్పా. అది విన్న మా సోషల్ మాస్టారు నా దగ్గరకొచ్చి బుజం మీద చెయ్యేసి " చాలా సంతోషం బ్రదర్. మనం ఇద్దరం ఈ ఊర్లో భావి తరాల్లో నిరక్ష్యరాస్యత అనేదే లేకుండా చేద్దాం బ్రదర్." అన్నాడు NTR స్టైల్లో (ఈయనకు కొంచెం అభ్యుదయ భావాలు ఎక్కువ లెండి ). మేమిద్దరం కలసి మురికి వాడలన్నీ సందు సందు గొందు గొందు తిరిగాం. చాలా మంది పిల్లల్ని తిరిగి స్కూల్ లో చేర్పించాం. హెడ్ మాస్టారు తెగ ఆనందపడిపోయాడు. నేను మాత్రం బేర్ మన్నాను. ఇంతా తిరిగి నేను పిడుగు రాయిలా ఉన్నా. మా సోషల్ మాస్టారు మాత్రం ఒంట్లో బాగోలేదని ఒక రోజు సెలవు పెట్టాడు. ఎలాగూ మురికి వాడలన్నీ తిరిగాం కదా ఏదో రోగం వచిందని నటించేస్తే సెలవు దొరుకుతుందని రెండు రోజుల నుండి భోజనం సరిగ్గా చెయ్యడం మానేసా. రాత్రిళ్ళు నిద్ర పోవడం కూడా మానేసా. (నిద్ర సరిగ్గా పట్టకుండా ఉండాలంటే నా దగ్గర ఒక కిటుకు ఉంది. పడుకోబోయే ముందు ఓ చెంబుడు నీళ్ళు తాగెయ్యటమే. గంట లో లఘుశంక ప్రారంభమవుతుంది. శంక తీరాక మళ్లీ ఓ చెంబుడు. ఈ సారి అరగంటకే శంక మొదలవుతుంది. ఇలా ఒక రాత్రిలో పదిసార్లు లేస్తే ఇంక నిద్రేం పడుతుంది!!). దాంతో కళ్ళు పీక్కుపోయాయి.

హెడ్ మాస్టారు చూసి "అదేంటయ్య అలా నీరసంగా అయిపోయావ్. మురికి వాడల దెబ్బ అనుకుంటా. ఒక పని చెయ్యి. రేపు ఎల్లుండి సెలవు తీసుకుని ఇంట్లో విశ్రాంతి తీసుకో. నేను ఇంకో పది రోజులు సెలవు లో ఉంటాను. ఆ జనాభా లెక్కల కోసం కావలిసిన సామగ్రి అంతా ఈరోజు వచ్చింది. అవనీ స్టోర్ రూం లో పెట్టించాను. అందులో మనం తిరగవలిసిన ఏరియాల లిస్టు కూడా ఉంది. మన మాస్టార్లే కాకుండా మన పక్క ఊరి హైస్కూల్ మాస్టార్లుకూడా మనతో కలిసి తిరుగుతారు. వాళ్ళ పేర్ల లిస్టు కూడా అందులో ఉంది. వాళ్ళలో ఎవరెవరు ఏయే ఏరియాలు తిరగాలో ఆ పని అంతా నువ్వే చూడాలి. ఇంకేవరికన్నా చెబుదామంటే అంతా తింగరమేళం. ఏం చెప్తే ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. పైగా నువ్వు ట్రైనింగ్ కి కూడా వెళ్ళావ్. మొన్న నువ్వు బడి బాట లో చూపిన ఉత్సాహం చూసి నువ్వొక్కడివే దీనికి సమర్దుడవని నాకు తెలుసు. ఇవిగో స్టోరే రూం తాళాలు. ఆరోగ్యం జాగర్త "
అని చావు కబురు చల్లగా చెప్పి చక్కాపోయాడు. ఇంకేం సిక్ లీవ్ నా బొంద!!

6 comments:

మధురవాణి said...

@స్థితప్రజ్ఞుడు,
మీ కథంతా చదివానండీ...ఇంతకీ కథ అయిపోయినట్టేనా..సశేషమా!
కథ narration అంతా చాలా బాగుందండీ.. కానీ, మీరు జనాభా లెక్కలు వేరు అంటూ మొదలెట్టారు కాబట్టి .. ఆ తిప్పలేంటో, అక్కడ ఎలా నలిగిపోయారో..వివరిస్తూ పూర్తి చేస్తే బాగుంటుంది అని నాకనిపించింది. పైగా అక్కడే బోల్డంత హాస్యానికి ఛాన్స్ ఉంది కదా.. కథ టైటిల్ కూడా అదే కదా! ;-)
మరో చిన్న మాట... హాస్యం కోసమే అయినా 'బట్ట తలోడు' అనే బదులు 'బట్ట తలాయన' అంటే బాగుంటుందేమోనండీ.. ఎందుకంటే, స్వయంగా మీరే గురువయ్యి ఉండి (అదే కథలో) పెద్దవాళ్ళని అలా అనడం మరీ అంత బాగోదని నా అభిప్రాయం.
ఏదో తోచింది రాసుకుంటూ పోవడమే తప్ప నేనేమీ పెద్ద కథకురాలిని కాదు.. కథకి ఉండాల్సిన రూల్స్ ఏంటో నాకేమీ తెలీదండీ.. మామూలుగా చదవగానే నాకేమనిపించిందో చెప్పాను. అంతేనండీ! మరోలా అనుకోరు కదూ.. :-)

మధురవాణి said...

మరో మాట... ఇన్నాళ్ళకి మీ బ్లాగేదో తెలిసింది నాకు :-)Thanks for the link!

మధురవాణి said...

అయ్యయ్యో.... వేరే నెలలో మిగతా భాగాలున్నాయని చూసుకోలేదండీ..:( వెరీ సారీ అండి.. పూర్తిగా చదివి మళ్ళీ చెప్తాను.

స్థితప్రజ్ఞుడు said...

@మధురవాణి

ఆహా...మీ వ్యాఖ్యతో నా బ్లాగు తరించింది...

సేభాసో సేభాసు (ఇది మీకు కాదు...నాకు!!!)

మీరు రాసింది నిజమే...ఇప్పుడు చదువుతుంటే నాకు కూడా అలాగే అనిపిస్తుంది..మీరు సూచించిన మార్పు చేసేసా.

మిగతా కథ కూడా చదివి మీ అభిప్రాయాల్ని చెప్పడం మరిచిపోకండే.......

తార said...

నాకు న్యూస్ చదివినట్టు అనిపించింది, మీరు కొంచం కృషి చెయ్యాలి, తెలుగు సాహిత్యం బాగా చదవండి, ఏ ఏ పుస్తకాలు చదవాలో మన సీనియర్ బ్లాగర్లు చెప్పగలరు. పెద్ద బ్లాగర్ల బ్లాగులు బాగా చదవండి వెతకండి మీకు మంచి పుస్తకాలు వివరాలు దొరుకుతాయి.

ఇంతకీ సమాప్తమా?

స్థితప్రజ్ఞుడు said...

మీరు నలుగు భాగాలే చదివినట్టున్నారు...ఇంకా ౩ ఉన్నాయ్...
మీ సలహా కి ధన్యవాదాలు.తప్పకుండా అలానే చదువుతా

Post a Comment