Jul 8, 2010

లెక్కల్లో.. జనాభా లెక్కలు వేరయా..5

తర్వాత పిరియడ్ 9th క్లాసు వాళ్ళకి. ఈ దెబ్బకి క్లాసు చెప్పాలన్న ఇంటరెస్ట్ అంతా పోయింది. ఐనా వెళ్లక తప్పదు కదా. నేను వెళ్లేసరికి క్లాసులో పిల్లలు తెగ గోల చేస్తున్నారు. ఎవరో ఒకర్ని ఇరగదీస్తే గాని దార్లోకొచ్చేటట్టు లేరు. "సైలెన్స్" అని ఒక పొలికేక వేశా. అంతే..అంతా స్మశాన నిశ్శబ్దం. ఈ నిశ్శబ్దం మరీ చిరాకుగా ఉంది. మాస్టారికి కోపంగా ఉందని గ్రహించినట్టున్నారు, అందరూ పుస్తకాల్లోకి తలలు దూర్చి కూర్చున్నారు. కచ్చితంగా  సమాధానం చెప్పడు, అని తెలిసిన వాడినోకడిని లేపి " He has gone to hyderabad, దీనికి passive voice చెప్పరా" అని అడిగా. వాడు  లేచి నిలబడి తల పూర్తిగా కిందకి దించి పాతాళంలోకి చూస్తూ నిలబడ్డాడు. ఎవ్వరూ నా వంక చూడట్లేదు. క్లాసు లో ఒక మూలగా ఉన్న బెత్తం తీసుకుని మెల్లగా వాడి దగ్గరకు నడిచా. వాడిని చావబాదడానికి సిద్ధం అవుతుండగా వెనకాల నుండి ఎవడో  " దానికి passive voice లేదు సర్" అన్నాడు. నిజమే!! నేను అప్పటి వరకు ఆలోచించనేలేదు, ఎలాగో వాడు చెప్పడు కదా అన్న ధైర్యం తో ఏదో నోటికొచ్చింది  అడిగేసా. ఎవడు చెప్పాడు వెనక నుండి? అని కూడా అడగాలనిపించలేదు.  నా కోపం చప్పున చల్లారిపోయింది. అనవసరం గా హెడ్ మాస్టారు మీద ఉన్న కోపం పిల్లల మీద చూపించినందుకు నా మీద నాకే చిరాకు కలిగింది. క్లాసు లీడర్ ని పిలిచి క్లాసు ని చూడమని చెప్పి నేను స్టాఫ్ రూం కి వచ్చేసా. కుర్చీలో  కళ్ళు మూసుకుని కూర్చుని కొంచెం రిలాక్స్ అవ్వడానికి ప్రయత్నిస్తుండగా........
"నమస్తే ఆనంద్ గారు". తలెత్తి చూస్తే రామంగాడు.
" మా స్కూల్ తరుపున నన్ను పంపిచారు. ఫీల్డ్ వర్క్ అసైన్ చెయ్యడానికి"
" సరిపోయింది, మా హెడ్డు గారు నన్ను నియమించారు ఆ పనికి."
"అయితే ఇంకేం, మనకి బాగా అనువైన ఏరియా చూసుకుని మనకి వేసేసుకుందాం, ఇంక ఆ మురికి వాడలన్ని మా సైన్సు మాస్టారు గాడికి వేసేద్దాం , రోగాలొచ్చి చస్తాడు వెధవ." అన్నాడు ఆనందంగా. ఇదేదో  బానే ఉంది గుడ్డి లో మెల్లలా.
"సర్లే పద, ఈరోజు ఆ పని అంతా పూర్తి చేసేద్దాం."
రామంగాడు, నేను కూర్చుని సాయంత్రానికల్లా ఎవరు ఏ ఏరియా వెళ్ళాలి, పేపర్స్ ఏమేం తీసుకెళ్ళాలి, లాంటివన్ని సిద్ధం చేసేసాం. వాళ్ళ స్కూల్ లిస్టు పట్టుకుని వాడు వెళ్ళిపోయాడు. మా లిస్టు పట్టుకుని నేను స్టాఫ్ రూం కి వెళ్లి ఎవరెవరు ఏ ఏ ఏరియాలు తిరగాలో అనౌన్స్ చేశా.
"బావుంది ఆనంద్ గారు, మీరు ఉన్న ఏరియా మీ పక్క ఏరియా మీరు తీసేసుకుని, మాకు మాత్రం శివారు ప్రాంతాలన్నీ వేసినట్టున్నారు. నాకు ఇచ్చినదేంటి....YSR అభ్యుదయ కాలనీయా. ఎక్కడుంది ఇది. ఓ... మొన్న రాజీవ్ గృహకల్ప అని ఊరు చివర శ్మశానం పక్కన కట్టిన అగ్గిపెట్టె  కాలనీ ఏనా." వెటకారంగా అడిగాడు లెక్కల మాస్టారు అప్పారావు.
"ఓహో YSR అభ్యుదయ కాలనీ అంటే అదా.నాకు తెలీదు సుమండీ.  చూసారా మీకు కాబట్టి తెలిసింది. అందుకే మీకు వేసా అది. నాకు ఒంట్లో బాలేదు కదండీ, అందుకనే మా కాలనీ వేసుకున్నా నాకు. ఒక పని చేద్దాం అయితే. నేను తీసుకున్న రెండు ఏరియా లు కూడా మీలో ఎవరో ఒకరు తీసుకోండి. హెడ్ మాస్టారు నాకు అప్పగించిన మిగతా పని అంతా అప్పారావు గారు చేస్తారు. నేను సిక్ లీవ్ తీసుకుంటా. ఏమంటారు??"
ఈ దెబ్బకి అప్పారావు మూస్కున్నాడు. ఈ వ్యవహారం మీద ఏవో చిన్న చిన్న అనుమానాలున్న మిగతావాళ్ళకి కూడా క్లియర్ అయినట్టున్నై. ఎవరూ ముందుకి రాలేదు.
"అందరూ ఒప్పుకున్నారు కాబట్టి, స్టోర్ రూం లో మీకు కావలిసిన పేపర్లు అవీ అన్ని సర్ది ఉంచాను. మీకు కాళీ ఉన్నప్పుడు వెళ్లి తీసుకోండి. వచ్చే గురువారం నుండి పని మొదలెట్టాలి."

No comments:

Post a Comment