Jul 29, 2010

డబ్బాకు లోకం దాసోహం....1





   "అంటే..సుఖపడిపోదాం అనుకుంటున్నావన్నమాట"

"అదేంటి నాన్నా!!!...computer science లో చేరదాం అనుకోవడం సుఖపడిపోవడమేంటి" విసుగ్గా అన్నాడు నా పుత్రరత్నం.


"కాక మరేంటి....డబ్బా ముందు కూర్చుని వేళ్ళాడించడం కూడా ఒక చదువేనా. చదివాక ఏం చేస్తావ్....ఏ దిక్కుమాలిన పాశ్చాత్య వాడి దగ్గరో  కొలువు చేస్తావ్. అప్పుడు కూడా వేళ్ళాడించడమేగా  గా. అలా వేళ్ళాడించి వేలకు వేలు సంపాదిస్తావ్. మిగతా వాళ్ళ నోట్లో మట్టి కొడతావ్" అన్నాను విసురుగా.

"మిగతా వాళ్ళెవరు నాన్నా.."

"ఇంకెవరు...రోజంతా కష్టపడి ఒళ్ళొంచి పని చేసేవాళ్ళు. ఎంత కష్టపడినా...ఇలా  వేళ్ళాడించే వాళ్ళు సంపాదించే దాంట్లో కనీసం పదో వంతు కూడా ఆర్జించలేరు పాపం."

" software engineers అందరినీ అలా తీసిపారేయకండి నాన్నా..వాళ్ళు కూడా చాలా కష్టపడతారు. అయినా ఎవడి సంపాదన వాడిది.  ఆవకాశం రాక గాని, మీరు చెప్పే ఆ ఒళ్ళొంచి పని చేసేవాళ్ళకి కూడా అలాంటి వేళ్ళాడించే ఉద్యోగమే చెయ్యాలని ఉంటుంది"

"ఒరేయ్! అలా సంపాదించేది ఒక సంపాదనే అంటావా. హాయిగా AC లో కూర్చుని వేళ్ళాడిస్తూ ...వేలకు వేలు సంపాదించేసి,  అ డబ్బుని ఎలా ఖర్చుపెట్టలో తెలియక, మామూలు ఇళ్ళకి కూడా ఎక్కువెక్కువ అద్దెలు కట్టేసి, అద్దెలు పెంచేశారు. సామాన్యుడిని బతకనీయకుండా  చేసారు. " కసి గా అన్నాను.

" బావుంది నాన్నా,  దేశంలో జరిగే ప్రతీ చెడు కి software engineers కారణం అనేట్టున్నావ్" వెటకారం స్పష్టంగా తెలుస్తోంది వాడి గొంతులో.

"అంటాను రా, అంటాను, దేశం లో వచ్చిన ప్రతీ చెడు మార్పుకి ఈ వేళ్ళాడించే వాళ్లే కారణం" ఎప్పటి నుంచో నాలో ఉన్నా కసంతా వెళ్ళగక్కాను. " ఆరు నూరైనా నువ్వు కంప్యూటర్ సైన్సు చదవడానికి వీల్లేదు, నేనొప్పుకోను"

                                    ఇది....  కొన్నాళ్ళ  క్రితం నాకు నా కొడుక్కి మధ్య జరిగిన వాగ్వాదం. ప్రస్తుతం నా కొడుకు నాగార్జున యూనివెర్సిటీ లో కంప్యూటర్ సైన్సు చదువుతున్నాడు. అంత గట్టిగా చేరొద్దని వాదించిన వాడివి ఎలా ఒప్పుకున్నావయ్యా అని మీరు అడగొచ్చు. అప్పుడే కాదు ఇప్పుడు కూడా నేను ఒప్పుకోవట్లేదు. వాడు నా మాట ఎప్పుడు విన్నాడు. వాళ్ళమ్మ ఎప్పుడు విననిచ్చింది. వాడు చేసే ప్రతీ పనికీ దాని సపోర్ట్ తప్పకుండా ఉంటుంది. ఒకవేళ నేనేమన్నా కాదన్నానుకోండి," సర్లే మీ యిష్టం, ఒరేయ్ నాన్నగారు చెప్పింది విను, అర్థమయ్యిందా" అని నా ముందే వాణ్ని  కసురుకుంటుంది. ఓహో మా ఆవిడ నాకే సపోర్ట్ అని ఓ రెండు రోజులు రొమ్మిరుసుకుని తిరుగుతా. మర్నాడు  మా  ఇంట్లో అల్పపీడనం పడుతుంది. ఓ రెండు రోజులకి వాయుగుండంగా మారుతుంది. కూరల్లో ఉప్పు కారం ఎక్కువవుతుంటాయి. చొక్కాల మీద మచ్చలు పడుతుంటాయి. ఇంట్లో కొత్త కొత్త నోముల మొదలవుతాయి. వాటి ఖర్చు తడిసి మోపెడవుతుంది. ఎప్పుడో మా ఆవిడ మొక్కుకున్న మొక్కులు తీర్చడానికి బయలుదేరాల్సి వస్తుంది. అసలే నాకు దైవ భక్తి ఎక్కువ. ఏం చేస్తాం....అలాంటి  పరిస్థితులలో నేను వద్దన్న దాన్ని ఒప్పుకోవాల్సి వస్తుంది. మా ఆవిడ నోము నోచింది అంటే కొద్ది రోజులు ముందు నేను ఏదో చెయ్యోద్దన్నానన్నమాట. ఈ సారి కూడా ఆ రకంగానే మా వాడు ఇంజనీరింగ్ లో చేరాడు.  ప్రస్తుతం మళ్లీ అల్పపీడన ద్రోణి మా ఇంటి ఇంటిమీదుగా తీరం దాటే ఆవకాశం కనపడుతోంది. నేనేడైతే జీవితం లో చేయ్యకూడదనుకున్ననో అది చెయ్యక తప్పేట్టు లేదు. అదే....డబ్బా కొనడం.

"ఏంటి నాన్నా, అర్థం చేసుకోవూ, కంప్యూటర్ లేకుండా కంప్యూటర్ సైన్సు చదవడం కష్టం నాన్నా", ప్రాధేయపడుతున్నాడు  బిడ్డ.

"ఏంటండీ పిల్లాడు అంతలా అడుగుతుంటే కాదంటారు, మీకు అంత ఇష్టం లేకపోతుంటే ఒద్దు లెండి, ఒరేయ్ నాన్నగారు చెప్పింది విను"

కూరల్లో ఉప్పూ కారం, చొక్కాల మీద మచ్చలు, నోములు, మొక్కులు మొదలైనవి నా కళ్ళ ముందు మెదలాడాయి. ఇంక ఒప్పేసుకుందాం  అనుకుంటున్నంతలో...

" ఇప్పుడు అంత డబ్బు మీ దగ్గర లేకపోతే, నా పేరు మీద లోన్ తీసుకుందాం, మీరు సంతకం పెట్టండి చాలు నాన్నా"
నా బాధ డబ్బు కాదు కదా. సర్లే ఏదోకటి నీ ఇష్టం అన్నా. మా వాడు ఎగిరి గంతేసి బ్యాంకుకు పరిగెత్తాడు. ఒక నెల  రోజుల్లో సంతకాలు చెయ్యడాలు, డబ్బు చేతికి అందడాలు, మా వాడు ఆ డబ్బు తో డబ్బా కొనేయ్యడాలు అన్ని జరిగిపోయాయి.
 ఓ రెండు రోజులు దాన్ని ఇంట్లో ఉంచి వాడి హాస్టల్ కు పట్టుకుపోయాడు. ఆ రెండు రోజులు నేను అదున్న గదిలోకి కూడా వెళ్ళలేదు.

డబ్బా అంటే నాకు అసహ్యమే కాదు, చిరాకు, వెగటు, జుగుప్స కూడా...
నేను పోస్ట్ మాన్ గా నా జీవితాన్ని ఆరంభించాను. ఎక్కువగా  నిరక్షరాస్యులు వుండే చోట్ల పని చేశాను. ఎవరికి  ఏ అవసరం వచ్చినా నా దగ్గరకే వచ్చేవారు.

"రావు గారూ ఒక ఉత్తరం ముక్క రాసి పెట్టరా....."
"రావు గారూ మా అమ్మాయి దగ్గర నుండి ఉత్తరం వచ్చిందా...."
"రావు గారూ ఈ ఉత్తరం కొంచెం చదివి చెప్పరా...."
"రావు గారూ మా అబ్బాయి దుబాయ్ నుండి డబ్బులు పంపించాడా...."

ఇలా ఎక్కడికి వెళ్ళినా మంచి పలుకుబడి ఉండేది. పండగలకి పబ్బాలకి మామూళ్ళ కింద ఎవరికీ తోచింది వాళ్ళు పంపిస్తూ ఉండేవారు. నిత్య కల్యాణం పచ్చ తోరణం అన్నట్టు ఉండేది. అలాంటి నా జీవితం లో మొదటి దెబ్బ కొట్టింది......ఏ ఒసామా బిన్ లాడెనో....జార్జి బుస్శో  అయినా పెద్ద పట్టించుకునే వాడిని కాదు....టెలిఫోన్. జనాలు ఉత్తరాలు రాయడమే మానేసారు. నా పలుకుబడి సగానికి సగం తగ్గిపోయింది. డబ్బా వచ్చాక అయితే మొత్తం గుండు సున్నా అయిపొయింది. టెలిఫోన్ అయితే ఏదో జనాల్లోకే  వచ్చింది కాని డబ్బా అయితే ఆఫీసుల్లోకి, బ్యాంకుల్లోకి కూడా వచ్చేసింది. అరె, ఆఫీసు లో చేసే ప్రతీ పని దాంతోనే. ప్రస్తుతం నేనే సీనియర్ మోస్ట్ మా ఆఫీసు లో. పోస్ట్ మాస్టర్ గా ఇంకో సంవత్సరం లో రిటైర్ అవ్వబోతున్నా. సీనియర్ మోస్ట్ అన్నాను కదా అని ఏదో అనుకునేరు, నా బతుకు ఈ మధ్య మరీ రబ్బర్ స్టాంప్ లా అయిపొయింది. నాకింద ఉన్న వాళ్ళందరూ చాలా మంది కొత్త వాళ్లే. నాతో పాటు అందరికీ డబ్బా ట్రైనింగ్ ఇచ్చారు ప్రభుత్వం వారు. అక్కడ డబ్బా పక్కన  వంకాయ లాంటిది ఒకటి ఉంది. దాన్ని ఎలుక అంటారంట, దాన్ని పట్టుకు పిసకాలంట. దాన్ని పిసికితే ముందు ఉన్న తెరపై ఏదో జరుగుతుందంట. ఎలకని పిసకడమేంటో. నాకు పరమ అసహ్యమేసింది. ఆ తర్వాత నుండి నా కింద ఉన్న పిల్లకాయలంతా దాన్నే పట్టుకుని వేళ్ళాడేవారు. పేపర్ పని చాలా వరకు తగ్గిపోయింది. నాకు కావాల్సిన ప్రతీ చిన్న పనికీ ఆ పిల్లకాయల్ని అడుక్కోవడమే.
ఇలా నా జీవితాన్ని నాశనం చేసిన డబ్బా అంటే నాకు కసి.

2 comments:

Ravitej said...

మనిషి కి ఉండే అహం ని మంచి హస్యం తో కలిపి చక్కగా రాసావు. నచ్చింది రా.

స్థితప్రజ్ఞుడు said...

నీ అభినందనలకు కృతజ్ఞతలు...
నువ్వు ఎప్పుడు రాస్తున్నావ్ నీ మొదటి టపా... ఇంతకీ....

Post a Comment