Jul 29, 2010

డబ్బాకు లోకం దాసోహం....2

మా వాడికి B .Tech పూర్తవ్వడం  నేను పదవీ విరమణ చెయ్యడం ఒకేసారి జరిగాయి. తర్వాత ఒక నెల పాటు ఇంట్లో ఉండి హైదరాబాద్ వెళ్ళిపోయాడు ఉద్యోగం వెతుక్కోవడం కోసం. ఉద్యోగం వచ్చాక స్వీట్స్ పట్టుకుని ఇంటి వచ్చాడు.
"నాన్నా నాకు ఉద్యోగం వచ్చింది"
" వేళ్ళాడించే వుద్యగమే గా....జీతం ఎంతేంటి"
"ముప్పై వేలు"
నేను పదవీ విరమణ చెయ్యబోయే ముందు అందుకున్న జీతం కన్నా ఒక రెండు వేలు ఎక్కువ.
అంతే  ఇంకేం  మాట్లాడలేదు  నేను .......
వాడు కూడా నా కోపం అర్థం చేసుకున్నట్టున్నాడు, ఉన్న రెండు రోజులూ ముభావం గానే ఉన్నాడు నాతో. హైదరాబాద్ లో ఉన్నన్నాళ్ళు  తరచుగానే  వస్తుండేవాడు. ఉన్న కంపెనీ లో promotion వచ్చాక, కొన్నాళ్ళు పని చేసి బెంగుళూరు లో ఇంకో కంపెనీ కి మారాడు. ఇవన్నీ వాళ్ళ అమ్మకే చెప్పాడు. నేను వాడిని అడగనూ లేదు, వాడు చెప్పనూ లేదు. నాలో కోపం రోజు రోజుకూ పెరగ సాగింది. రిటైర్ అయ్యాక ఇంక చెయ్యడానికి ఏమి ఉండదు, పాత జ్ఞాపకాలన్నే నెమరు వేసుకుంటూ గడపడమే. నేను ఏమి చేద్దామన్నా, నా ఆలోచనలు చివరికి డబ్బా దగ్గరా, మా వాడి దగ్గరకు వచ్చి ఆగుతాయి. పిచ్చ కోపం వస్తుంది. ఎవరి మీద చూపించాలో అర్థం కాదు. ఇంతలో నా స్నేహితుడు రామరాజు మా వాడి పెళ్లి ప్రసక్తి తేవడం, వాళ్ళ అమ్మాయి తో పెళ్లి అయిపోవడం జరిగిపోయింది. పెళ్లి అయ్యాక వాడు రావడం కొంచెం  తగ్గింది. ఫోన్ మాత్రం తరచుగానే చేస్తుంటాడు.   
సంవత్సరం తిరిగే సరికి నాకు మనుమడు కూడా పుట్టుకొచ్చాడు. వెళ్లి ఒక నెల రోజులు ఉండి వచ్చాం నేను మా ఆవిడాను. మనుమడి కేరింతలతో నెల రోజులు ఇట్టే గడిచిపోయాయి. ఇంటికి తిరిగి వచ్చాక వొంటరితనం  భయంకరంగా అనిపించింది. మళ్ళీ మనుమడి దగ్గరకి ఎప్పుడు వెళ్తానా అని మనసు ఉవ్విల్లూరసాగింది. కానీ అలా అని బైట పడడం నాకు ఇష్టం లేదు.  

ఇంతలో  మా వాడు ఒక శనివారం హటాత్తుగా ఊడిపడ్డాడు. వాడు, మా ఆవిడ,  మా రెండో బెడ్రూం లో దూరి ఏవో గుసగుస లాడుకున్నారు. రాత్రి కి వెళ్ళిపోయాడు. ఆ బెడ్రూం మేము ఎవరైనా చుట్టాలు వస్తే తప్ప మామూలుగా వాడం. మర్నాడు  సాయంత్రం  మా ఆవిడ రెండో బెడ్రూం లోకి వెళ్లి తలుపేసుకుంది  ఒక గంట ఉండి బైటకు వచ్చి తలుపుకి తాళం వేసింది. రోజూ ఇదే తంతు. ఏంటని అడగాలనిపించినా, నాకు చెప్పడం వాడికంత ఇష్టం లేనప్పుడు నాకెందుకు, అని అడగలేదు చాన్నాళ్ళు. ఒక  రోజు  తలుపుకి చెవి ఆనించి వింటే లోన్నుండీ  మనుమడి కేరింతలు వినపడ్డాయి. బైటకు వచ్చాక ఆపుకోలేక అడిగా....

"ఎం చేస్తున్నావే లోపల" నా గొంతు లో ఆత్రం.

"మీకు చెప్పినా అర్థం కాదు లెండి" నా ఆత్రం అర్ధమయ్యి తాపీగా చెప్పింది.

 "ఎందుకని"

 "ఎందుకంటే అది మీ కొడుక్కీ, వాడి డబ్బా కి సంభందించిన విషయం కాబట్టి" కుండ బద్దలు కొట్టింది.

అదే నిజమో, లేక నాకు అలా చెబితే నేను ఇంక దాని గురించి అడగనని చెప్పిందో నాకు అర్థం కాలేదు. ఇంక నేనేమీ అడగలేదు.

 ఒక రోజు  అది గుడికి వెళ్ళిన  సమయంలో తాళం తీసుకుని గదిలో కి వెళ్ళాను. అక్కడ చూసిన దృశ్యం తో  నాకు కోపం నషాళానికి అంటింది. బల్ల మీద నల్లగా.... ఒళ్లో డబ్బా (laptop). కోపంతో వెన్నక్కి తిరిగే సరికి మా ఆవిడ చిద్విలాసంగా నవ్వుతూ కనపడింది.

"ఏంటండీ, చూస్తున్నారు?" వంటింట్లో దొంగతనంగా పంచదార తినేస్తున్న పిల్లాడిని అడిగినట్టు అడిగింది.

"రోజు నువ్వు ఈ గది లో దూరి ఏం చేస్తున్నావో చూద్దామని" కోపం నటించాను.

"అడిగితే నేనే చూపించేదాన్నిగా"

ఏం చెప్పాలో అర్థంకాలేదు నాకు.

మళ్లీ తనే చెప్పసాగింది, " అందులో మనవడు కనపడతాడు, రోజూ నాతో కబ్లు చెబుతాడు. అలా కనపడాలంటే ఏం చెయ్యాలో నాకు చెప్పి వెళ్ళాడు మన అబ్బాయి.  మీకు డబ్బా అంటే చిరాకు కదా అని చెప్పలేదు"

"ఏంటి మనమడు కనపడతాడా?  నా చెవి లో పువ్వేమన్న కనపడుతోందా....."

"నమ్మక పోతే మనేయ్యండీ, కావాలంటే చూపిస్తా...." అని డబ్బా తెరిచి టక టకా ఏవేవో నొక్కింది. తెర మీద బొమ్మ వచ్చింది. దాంట్లో నా మనుమడు ఆడుకుంటూ కనిపించాడు. నాకు నోట మాట రాలేదు.....
 ఏదో అనుకుంటున్నంతలో టపీమని కట్టేసింది.

" మీకు ఇదంటే ఎంత అసహ్యమో నాకు తెలుసు. ఇంక మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. మీరు లేనప్పుడు మాత్రమే ఉపయోగిస్తా లెండి."  అని గడుసుగా చెప్పి వంటింటి లోకి వెళ్ళిపోయింది.

నాకు కాలూ చెయ్యి ఆడడం లేదు. మళ్ళీ మనుమడిని చూడాలని ఉంది. ఇదేమో గడుసుగా "మీకు చిరాకు కదా" అంటుంది.
అయినా ఎలా గో మనసు చంపుకుని అడిగా.  "ఇంకోసారి నాకు చూపించవే మనుమడిని" అర్ధించా.
"మీకు చిరాకు కదా...... అయినా లోక జ్ఞానం లేని దాన్ని. మీకు చెప్పడం నాకు రాదు బాబు. మీ అబ్బాయిని  అడిగి నేర్చుకోండి."
పొయ్యి మీంచి పెనం మీద పడినట్టైంది. అడగాలా వొద్దా అని ఒక వారం రోజులు తర్జన భర్జన పడిన తర్వాత అడిగా ఒరేయ్ నాకు మనుమడిని డబ్బాలో చూడడం నేర్పరా అని. ఆ వారంతం లోనే వచ్చేసాడు. వాడి ముఖం లో ఆనందం ప్రస్పుటం గా కనబడుతోంది.
"ఎంటే అమ్మా, నాన్నేనా  నేర్పమని  అడిగింది." ఆశ్చర్యం ఆనందం కలిసిన స్వరం తో అడిగాడు.

"నిజమే రా నాయనా. ఏంటో, బ్రహ్మం గారు చెప్పిన ప్రళయం వచ్చేట్టుంది" ప్రళయం కొంచెం నొక్కి పలికింది.

నాకు సిగ్గు తో ఏం మాట్లాడాలో అర్థం కాలేదు.

"నేను ప్రతీ వారంతం వచ్చి మీకు వచ్చే దాకా నేర్పుతా కదా, మీరేం కంగారు పడకండి, ఒక నెల రోజుల్లో మీరు మీ మనుమడితో రోజూ కబుర్లు చెబుతుంటారు" అని భరోసా ఇచ్చాడు.

చాన్నాళ్ళ తర్వాత వాడు నాతో ఫ్రీ గా ఉన్నాడు. నాకు మొట్ట మొదటి సారి అనిపించింది డబ్బా మీద కోపం తో వాడికి దూరం అవుతున్ననేమో అని. నాకు వాడికి మధ్యన అడ్డుగా ఉన్న డబ్బా సంగతి ఏంటో చూద్దామన్నంత కసి వచ్చింది. ఆరోజే వాడు పాఠం  మొదలెట్టాడు. username, password,internet, google, chat లాంటి నాకు తెలియని పదాలెన్నో పరిచయం చేసాడు. వాడు ఎంత ఓపిగ్గా చెప్పినా....అవన్నీ నా మట్టి బుర్ర లోకి ఎక్కడానికి, ఎలుక మీద....కాదు కాదు .... మౌస్  మీద పట్టు సంపాదించడానికి సంవత్సరం పట్టింది. నేను ఇన్ని నేర్చుకుంటూ ఉన్నా...డబ్బా ముందు నాతో పాటు ఎప్పుడూ కూర్చునేది కాదు మా ఆవిడ, మా వాడితో chat  చేస్తున్నప్పుడు తప్ప. ఎప్పుడు అడిగినా...నాకు వచ్చు...మీరు నేర్చుకోండి చాలు...మీకు వస్తే నాకు వచ్చినట్టే, అనేది. ఒక రోజు నాకు హటాత్తుగా ఓ  అనుమానం వచ్చింది. నాకు నేర్చుకోవడానికి సంవత్సరం పట్టిందే!! తను ఒకే రోజులో ఎలా నేర్చుకుందబ్బా...?? అని. ఆ విషయం అడిగితే, ఏదో లోకజ్ఞానం లేనిదాన్నని అసలు విషయం మారుస్తుంది. అందుకని మా వాడినే తిన్నగా అడిగా.

వాడు నవ్వేసి, "ఏమి లేదు నాన్నా...నువ్వు అనవసరం గా కంప్యూటర్ మీద కోపం తో నాతో  సరిగ్గా ఉండటం లేదు. నువ్వు నీ మనుమడితో చాలా సంతోషం గా ఉండడం గమనించాను. వాడిని అడ్డం పెట్టుకొని నిన్ను మార్చాలని అలా చేసాను. అమ్మకేమి నేర్పలేదు ఆ రోజు నేను. బుజ్జిగాడి వీడియో ఒకటి తీసి laptop లో పెట్టా...కంప్యూటర్ ఆన్ చెయ్యగానే ఆ వీడియో దానంతట అదే ప్లే అయ్యేలా చేశా. అమ్మా చేసిందల్లా కంప్యూటర్ పవర్ బటన్ నొక్కడమే. ఆ వీడియో ప్లే అయ్యే లోపు ఏదో ఒకటి నొక్కుతూ ఉండమని చెప్పా...అంతే"
 హమ్మ...నన్నిరికించడానికి ఎంత ప్లాన్ వేసారు!!!!!
ఏదేమైనా.....ఇప్పుడు రోజూ నా మనుమడు నాతో కేరింతలు కొడుతున్నాడు.

1 comment:

lalitha said...

very good prasad . keep it up.

Post a Comment