Jul 9, 2010

లెక్కల్లో.. జనాభా లెక్కలు వేరయా..7

ఒక ఇంటికి తాళం లేదు గాని ఎంతసేపు తలుపు కొట్టినా ఎవరూ తీయలేదు. ఇంక వెళ్ళిపోదాం అనుకుంటుండగా, ఒక వ్యక్తి వచ్చి తలుపు తీసి తూలుతూ నిలబడి ఏం కావాలి అని చేత్తో సంజ్ఞ చేసాడు. జనాభా లెక్కలు అని నేను కూడా సంజ్ఞ చేద్దామనుకున్నా కాని  ఎలా చెయ్యాలో అర్థం కాలేదు. "జనాభా లెక్కలు" అన్నా.
"ఆ....వినబళ్ళా"
"జనాభా లెక్కలు"
తూలుతూ ఉంటే నిద్రపోతున్నాడేమో అనుకున్నా, లేదు, బాగా మందు కొట్టి ఉన్నాడు.
"జనాభా లెక్కలు ఎందుకు బ్రదర్, కుళ్ళిపోయిన సమాజానికి సారధ్యం వహిస్తున్న స్వార్థ రాజకీయనాయకుల గుడ్డి ప్రభుత్వం, జవసత్వాలుడిగిన న్యాయవ్యవస్త ఉన్నన్నాళ్ళు నువ్వు నేను జనాలకి ఎంత సేవ చేసినా ఏం లాభం బ్రదర్. మీరు నాతో రండి, కలిసి మందు కొడదాం, అభివృద్దిని సాధిద్దాం."
అర్థం చేసుకోవడానికి నాకు పావుగంట పట్టింది.
ఏం అర్థం అయ్యిందో ,రామం గాడు నా చెవిలో " అవును సార్, మన ప్రబుత్వం చెబుతున్నదీ అదే కదా, సంక్షేమ కార్యక్రమాలకు మా దగ్గర డబ్బు లేదు. మందు కొట్టండి, ప్రబుత్వ ఖజానాలు నింపండి. అప్పుడే సంక్షేమ కార్యక్రమాలు నడపగలం అని....."
"చాల్లే ఆపు, నువ్వు కూడా వీడితో కలిసి మందు కొట్టేట్టున్నావ్, ఇంటికి తాళం వేసుంది అని రాసుకో, మళ్లీ ఇంకోసారి వద్దాం"

ఈసారి తెలుగు మాస్టారికి ఆవకాశం ఇచ్చా. తలుపు కొట్టగానే బిలబిల మంటూ ముగ్గురు పిల్లలు తలుపు తీసుకుని  బయటకు పరిగెత్తారు. వాళ్ళ వెనకాలే ఒక పెద్ద మనిషి బైటకు వచాడు. పెద్ద మనిషంటే  పెద్దమనిషే, పెదరాయుడు సినిమాలో రజనికాంత్ లా ఉన్నాడు. అడిగిన వాటికి స్పష్టంగా సమాధానాలు చెప్పాడు. పడి నిముషాల్లో పని పూర్తయ్యింది. ఎందుకు నాకే ఇలా జరుగుతుంది. ఆయన వెళ్ళగానే పది నిముషాల్లో సుఖంగా పని పూర్తయిపోతుంది. నేను వెళ్ళిన చోటల్లా శనిగాళ్ళే. రామం గాడి శాపం నిజం అయ్యినట్టుంది.

తరువాత ఇంటికికూడా తెలుగు మాస్తార్నే అడగమని చెప్పా. అయన వెళ్లి బెల్ కొట్టగానే, ఆయన్ని పక్కకు లాగేసి నేను నుంచున్నా గుమ్మం ముందు. ఇప్పుడు తెలిసిపోతుంది రామంగాడి శాపం నిజం అయ్యిందో లేదో. తలుపు తీసుకుని సినిమా లో సాయిబాబా వేషం వేసిన విజయ్ చందర్  లాంటి ప్రశాంతమైన ఫేసున్న ఒకాయన బైటకు వచ్చాడు. ఆహా!! ఈసారి త్వరగా అయ్యేలా ఉంది కదా పని అని అనిపించింది.
"ఏం కావాలి బిడ్డలారా..."
ఈయనెవరో పాస్టరు లా ఉన్నాడు.
"జనాభా లెక్కల కోసం వచ్చామండి"
"ఆ దేవునికి తెలుసు తను ఎంతమందిని సృష్టించాడో. మనకు తెలియాల్సిన అవసరం లేదు. పైగా ఆ దేవుని బిడ్డలైన మనుషులను లెక్కించడం పాపం, బిడ్డలారా. ఇలాంటి పాపపు పనుల నుండి విముక్తి పొందుటకు బాప్టిసం ఒక్కటే దారి. రండి బిడ్డలారా, ఇప్పుడు మీ కొరకు ప్రార్థన చేసి మిమ్మల్ని మీరు చేసినా పాపాలనుండి విముక్తి చేసెదను." అని పాపులమైన మా కొరకు ప్రార్థన చెయ్యడం మొదలెట్టాడు.
ఆయన్ని సముదాయించి, జనాభా లెక్కల వల్ల ఉపయోగాలు వివరించి, అయన దగ్గర నుండి మాకు కావలిసిన సమాచారం రాబట్టేసరికి దేవతలు...కాదు కాదు...ఆ జీసస్ కనిపించాడు.

ఇంక రిస్క్ తీసుకోదలుచుకోలేదు. ప్రశ్నలు అన్నీ తెలుగు మాస్టారునే  అడగమని నేనే ఆయన్ని ఫాలో అవడం మొదలెట్టాను. అదేం విచిత్రమో అంతా చాలా సాఫీగా సాగిపోయింది. అడపా దడపా ఏదో చిన్న చిన్న ఎదురుదెబ్బలు తగిలినా..నాకు తగిలిన దెబ్బలతో పోల్చుకుంటే అవి అసలు లెక్కలోకి తీసుకోనవసరం లేదు. అలా సాఫీ గా ఒక వారం రోజుల్లో చాలావరకు పూర్తి చెయ్యగలిగాం. ఇంక మిగిలిన రోజు ఉత్సాహం గా సాయంత్రం వరకూ చాలా ఇళ్లు తిరిగాం. ఇంతలో నాకు మళ్లీ దురద కలిగింది. రామం గాడి శాపం ఇంకా పనిచేస్తోందా అని. తరువాత ఇంటికి నేను కాలింగ్ బెల్ కొట్టాను. ఓ ముసలాయన వచ్చి తలుపు తీసాడు.
"ఏం కావాలి బాబు."
"జనాభా లెక్కల కోసం వచ్చామండి."
"ఏంటి నాయనా గొనుగుతున్నావ్"
కొంచెం చవుడనుకుంటా పాపం ఆయనకి. " జనాభా లెక్కల కోసం వచ్చామండి" సాధ్యమైనంత గట్టిగా అరిచా.
"ఏంటి నాయనా...."
వార్నాయనో....
ఇంతలో ఒక అమ్మాయి బైటకు వచ్చి ఆయన్ని చెయ్యి పట్టుకుని లోపలి తీసుకెళ్ళింది. మళ్లీ  బైటకు వచ్చి...
"నాన్నకు కొంచెం చెవుడు.చెప్పండి ఏం కావాలి"
"మేం జనాభా లెక్కల నుండి వస్తున్నాం. మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలి"
"అడగండి"
"ఇంటి పెద్ద ఎవరు?"
"మా నాన్న, పిలవమంటారా..."
"వద్దమ్మా....నువ్వు చెప్పు చాలు."
ఇంటి గురించి, వాళ్ళకున్న వసతుల గురించి అడిగిన తర్వాత....
"పెళ్లి అయిందా..."
"ఆ.. అయ్యింది"
"మీ అయన పేరు.."
"చెప్పను.."
"పోనీ సిగ్గైతే...ఈ పేపర్ మీద రాయండి"
"రాయను.."
"అదేంటమ్మా..."
"అదంతే..."
ఇంతలో ఆ అమ్మాయి తల్లి బైటకు వచ్చింది. దేవుడి దయ వల్ల ఈవిడకు చెవుడు లేదు. " అది వాళ్ళ ఆయనతో గొడవ పడి ఇక్కడికి వచ్చింది నాయనా. అందుకే చెప్పనంటోంది."
"పోనీ మీరు చెప్పండి"
"నా అల్లుడు పేరు నేనెలా చెప్పను నాయనా"
పోనీ ఈ పిల్ల తండ్రిని అడుగుదామంటే..ఆయనకు నే చెప్పింది వినిపించేసరికి నేను మూగ వాడినయ్యేలా ఉన్నా. ఈ మీమాంస లో ఉండగా..రామం గాడు మాకు ఇచ్చిన రూలు బుక్ లోనుండి ఒక అద్వితీయమైన రూలు ఒకటి పట్టుకున్నాడు. అదేంటంటే...ఎవరైనా ఒక చోట ఒక నెల రోజుల కన్నా తక్కువ రోజులు ఉన్నట్టయితే, వాళ్ళని వాళ్ళు ఇంతకు ముందు ఉన్న చోట లెక్కపెట్టాలని.
"మీరు ఇక్కడికి వచ్చి ఎన్నాళ్లైందండి"
"నాలుగు రోజులు"
చెవిలో అమృతం పోసినట్టైంది. మిగతా వివరాలన్నీ త్వరత్వరగా పూర్తి చేసేసి అక్కడి నుండి బైట పడ్డాం. ఇంక మిగతా పని అంతా తెలుగు మాస్టారు, రామం గాడు పూర్తి చేసారు. ఆ రోజు సాయంత్రమే స్కూల్ కి వెళ్లి పూర్తి చేసిన పేపర్స్ అన్నీ జిల్లా హెడ్డాఫీసుకి పంపేసాం. చాలా రోజుల తర్వాత నేను హుషారుగా ఇంటికి వెళ్ళా.

మర్నాడు ఎగరేసుకుంటా స్కూల్ కి వెళ్లాను. ఈరోజు హెడ్ మాస్టారు డ్యూటీ లో జాయిన్ అవుతారు. అయన నాకు అప్పగించిన బాధ్యతనంతా ఎలా పూర్తి చేసానో, క్లిష్ట పరిస్థితుల్ని ఎలా ఎదుర్కొన్నానో వివులం గా వివరించి ఆయన దగ్గర మార్కులు కొట్టేద్దామని తిన్నగా అయన రూం కే వెళ్ళా. నన్ను చూసేసరికి అయన లేచి నిలబడి.....
"సెభాష్, ఆనందూ, నాకు నీ మీద ఉన్న నమ్మకం తప్పు కాదని నిరూపించావ్"
నా చాతీ ఓ..నాలుగు సెంటిమీటర్లు వ్యాకోచించింది.
"మన తెలుగు మాస్టారు అయితే ఉదయాన్నే వచ్చి, నీ గురించి తెగ పొగిడేసాడు. నువ్వు ఉండబట్టి ఈ పని అంతా ఎలాంటి అవాంతరం లేకుండా పూర్తి అయ్యిందని.."
ఇంకో రెండు సెంటిమీటర్లు..
"ఇంత సాధించిన నీకు ఇంకో చిన్న పని అప్పగిద్దామనుకుంటున్నా.."
ఛాతి కొంచెం సంకోచించినట్టనిపించింది.
"నేను వచ్చే వారం నుండి ఓ రెండు వారాలు లీవ్ లో ఉంటా, పదో తరగతి పరీక్షలు వచ్చే వారం నుండి ప్రారంభం అవబోతున్నాయి అని నీకు తెలుసుగా. మరి నేను వచ్చే వరకు ఆ పని అంతా నువ్వు చూసుకుంటే లీవ్ లో ఉన్న నాకు టెన్షన్ ఉండదు. మిగతా వాళ్ళ గురించి నీకు తెలుసుగా...ఏమంటావ్?"
..........

10 comments:

Unknown said...

KATTI....

స్థితప్రజ్ఞుడు said...

thanks ra.....

Karpooram said...

arey neekunna vishaya parijnananiki na joharlu. kummesavu

స్థితప్రజ్ఞుడు said...

@దత్తు.

అసలు నీలాంటి ఒక క్రిటిక్ నా కథ చదవడమే నా అదృష్టం. అలాంటిది నువ్వు నా కథను మెచ్చుకున్నావు అంటే...

చాలు ఈ జీవితానికి....ఇంక జీవితంలో నేను సాధించడానికి ఏమి లేదు..

మధురవాణి said...

కథంతా చదివానండీ! నిజంగా చాలా బాగుంది. చాలా చక్కగా రాశారు. మీరు ఏదైనా ఇంటర్నెట్ పత్రికకి పంపించినా తప్పకుండా వేసుకునేవారు. మీకు ఆసక్తి ఉంటే ఈసారి ఏదైనా కథ వ్రాస్తే పంపించి చూడండి. వేరేగా ఏమీ లేదు కానీ, బ్లాగ్లో కంటే ఎక్కువ మందికి చేరువవుతుంది మనం రాసిన కథ. అంతే! :-) కాకపోతే, లా పంపే ముందు మరొక్కసారి అంతా చూసి చిన్న చిన్న అక్షర దోషాలు కూడా సరిచేస్తే అయిపోతుంది. అంతే! :-)
Wishing to see many more stories from you. :-)

మధురవాణి said...

One more thing is.. please remove 'word verification' option in your comment settings. That makes it easier to comment in your blog. :-)

స్థితప్రజ్ఞుడు said...

@మధురవాణి.

చాలా ఆనందంగా ఉందండి..మీరు నా కథంతా ఓపిగ్గా చదివి..వ్యాఖ్య కూడా రాసినందుకు.

మీరు చెప్పారు కాబట్టి..అక్షర దోషాలు సరిచేసాక..ఎవరికైనా పంపించి చూస్తాను...పబ్లిష్ చేస్తారేమో....

వ్యాఖ్య రాయడానికి ఉండే word verification తీసేసాను..

మధురవాణి said...

ఒక ముఖ్యమైన విషయం... కథని మీరేదైనా పత్రికకి పంపాలనుకుంటే మాత్రం మీరు ఈ కథని అర్జెంటుగా బ్లాగులోంచి తీసెయ్యండి. ఇదివరకే బ్లాగులో ప్రచురించుకున్న కథల్ని పత్రికల వాళ్ళు తీస్కోరు. మీ బ్లాగులో ఈ కథని ఎవరూ చదివినట్టు నాకనిపించలేదు. అంటే నా ఉద్దేశ్యం, మీరు పెద్దగా ఎవరికీ చూపించలేదనుకుంటా కదా ఈ కథని! ఇంకా ఎవరికీ తెలీదు అనుకుంటే.. అర్జెంటుగా బ్లాగులోంచి తీసేసి మొత్తం సరి చేసి అప్పుడు ఏదన్నా పత్రికకి పంపండి. సాధారణంగా 'ఈ కథ ఇదివరకెక్కడా ప్రచురింపబడలేదు' అని రాసిమ్మంటారు పత్రికల వాళ్ళు. ఈ విషయం దృష్టిలో పెట్టుకోండి ఇక నుంచి. సరేనా!
మీకింకేదన్నా సందేహాలున్నా నాకు మెయిల్ చేసినా పర్లేదు. నాకు తెలిసిన విషయమైతే తప్పక చెప్తాను. మీరు మాత్రం కథలు రాస్తుండండి. నిజంగా బాగా రాశారు. wish you good luck :-)

తార said...

దీనికి 7 భాగాలు అవసరంలేదెమో అని నా భావన, ఏ ఒక్క భాగం ఆసక్తి కలిగించే విధంగా లేదు, అంటే తరువాతి భాగం కోసం ఎదురు చుడాలి అని అనిపించే విధంగా లేదు.
ఇది ఎదైనా పత్రికలో అని మధురవాణి గారు ఏ ఉద్దేశంతో అన్నారో నాకు అర్ధం కావటం లేదు.
తరువాత మురికివాడల ప్రస్తావన అసంధర్భంగా ఉన్నది, బహుసా అన్న కధాప్రభావం ఎమో,

ఒకటి, రెండు సంవత్సరాలు ఆగి, ఇదే కధని మాళ్ళీ రాసి చూడంది,అప్పుడు కనపడిన తెడానే మీ రచనలో వచ్చిన మార్పు.

స్థితప్రజ్ఞుడు said...

ఏదో తోచింది రాసుకుంటూ పోయాను...అంతే..
బాగా రాయడానికి తప్పకుండా ప్రయత్నిస్తాను.....

Post a Comment