Jul 9, 2010

లెక్కల్లో.. జనాభా లెక్కలు వేరయా..6

చెయ్యాల్సిన పని, తిరగాల్సిన ఏరియాలు తల్చుకుని మొదట్లో బాధపడ్డాను గాని, ప్రతీ పని నేనే దగ్గరుండి చూసుకోవాల్సి రావడం, అందరూ వచ్చి నన్నే డౌట్లు అడగడం చూసి ఏదో పెద్ద నాయకుడిని అయిపోయిన ఫీలింగ్ వచ్చింది. నేనేదో డీలా పడిపోతానని అనుకున్న మా ఇంట్లో వాళ్ళు కూడా నా ఉత్సాహం చూసి మహదానందపడిపోయారు. రామం గాడిని కూడా నా గ్రూప్ లో వేసుకున్నా. ఇందులో నా స్వార్థం ఏదో ఉందనుకునేరు?? వాడి అత్తవారిల్లు మా పక్క ఏరియా లోనే. ఈ జనాభా లెక్కలన్నాళ్ళు వాళ్ళ ఇంట్లో పడి మేయ్యచ్చనే వాడి చావు తెలివితేటలవల్ల అలా చెయ్యాల్సొచ్చింది. ఈ హడావిడి లో వాడి శాపం గురించి మర్చిపోయాను. వాడి శాపం నిజం అయితే చూసి ఆనందిద్దామని నా గ్రూప్ లో చేరాడా కొంపదీసి అన్న అనుమానం కూడా వచ్చింది. అదే నిజమైన చేసేదేముంది ఇప్పుడు. ఈ ఆలోచనలతో ఉండగా..ఆ రోజు రానే వచ్చింది. నేను రెడీ అయ్యేసరికి రామంగాడు, మా తెలుగు మాస్టారు ఒకే సారి వచ్చారు. రామంగాడి మొహం వెలిగిపోతోంది. నిన్నటి నుండే అత్తారింటిలో మేయ్యడం మొదలెట్టేసినట్టున్నాడు. ఇంతకీ తెలుగు మాస్టారునే ఎందుకు నా గ్రూప్ లో సెలెక్ట్ చేసానంటే, నేను చెప్పింది చెప్పినట్టు ఎదురు ప్రశ్నలు వెయ్యకుండా పని  చేసేది మా స్కూల్ లో ఆయనొక్కడే కాబట్టి. మొత్తానికి ఇంటి నుండి బయలుదేరాను. నేను ముందు,  మిగతా ఇద్దరూ నా వెనుక వస్తుంటే  చిన్నప్పుడు బుర్రకథ లో విన్న..... రాజు వెడలె రవితేజములలరగ...అన్న పద్యం గుర్తుకు వచ్చింది.

మా పక్క ఏరియా నుండి మొదలెట్టాం. మొదటింటికి వెళ్ళామో లేదో చి...న్న తలుపుకి పే...ద్ద తాళం కనపడింది. శకునం బాలేదు. ఇలా తాళాలేసి ఉన్న ఇళ్ళ తో ఇంకా కష్టం, మళ్లీ రావాలి ఖర్మ.

తరువాత ఇంటికి  తాళం లేదు. తలుపు కొట్టగానే ఒక పెద్దావిడ వచ్చి తీసింది.
"ఏం కావాలి బాబు"
"మేం జనాభా లెక్కల కోసం వచ్చాం"
"మీ ID card చూపించండి బాబు" అనే సరికి షాక్ తిన్నా నేను.
"ఇదిగో, ఐనా మా ID card చెక్ చెయ్యాలని మీకు ఎందుకనిపించింది!!!"
"ఏముంది బాబు, దొంగ ముండాకొడుకులు ఎక్కువైపోయారు. పగలే ఇళ్లు దోచేస్తున్నారు. ఈ వంకన దోచేయ్యరని నమ్మకం ఏమిటి?"
అమ్మ ముసల్దానా, ఎంత తెలివే నీకు!! అని మనసులో అనుకుని  "నేను అడిగిన ప్రశ్నలకి జవాబు చెప్పండి" అన్నా.
" ఉండండి బాబు, కుర్చీ తీసుకువస్తా" అని లోపలికెళ్ళి కుర్చీలు తీసుకొచ్చి, కాఫీ కూడా ఇచ్చింది. వాళ్ళ కుటుంబంతో కలిసి అడిగిన ప్రశ్నలు అన్నింటికీ ఓపిగ్గా సమాధానం కూడా చెప్పింది.
సంతకాలవీ తీసుకోవడం పూర్తయ్యాక " ఈ చీటీ ఉంచమ్మా, ఇంకో నెల తర్వాత ఫోటోలు, వేలిముద్రలు తీసుకోవడానికి వస్తారు. వాళ్ళకి ఈ చీటీ ఇవ్వాలి" అని చీటీ ఇచ్చాను.
" అలాగే బాబు, వెళ్లి రండి"
 బైటకు వచ్చాక రామంగాడి తో అన్నా," చూసావు రా, ఎంత సులువో, ఈ మాత్రం దానికి ఏదో శాపం కూడా ఇచ్చావ్."
"అందరూ ఒకేలా ఉండరండి.చూద్దాం". వాడు అనకపోయినా, ముందుంది  ముసళ్ల పండగ అని అన్నట్టు అనిపించింది నాకు.

తరువాత ఇల్లు చాలా చిన్నగా ఉంది. గేటు నుండి ఒక అడుగు దూరంలో  ఉంటుంది గుమ్మం. గేటు బైట నుండి తలుపు కొట్టగానే ఒక వ్యక్తి వచ్చి తలుపు తీసాడు.
" ఏం కావాలి"
"మేం జనాభా లెక్కల కోసం వచ్చాం"
"సారీ, నా దగ్గర లేవు"
"అంటే, జనాభా ఎంత మంది ఉన్నారో తెలుసుకోవడానికి వచ్చాం"
"సారి, నాకు తెలీదు"
"అదీ..అంటే, జనాభా ఎంత మంది ఉన్నారో లెక్కపెట్టడానికి వచ్చాం"
"ఓహో, లెక్కపెట్టి ఏం చేస్తారు."
ఇంతలో రామంగాడు నా చెయ్యి పట్టుకుని పక్కకి లాక్కుపోయాడు.
" వీడ్ని లెక్కపెట్టడం అవసరం అంటారా.."
" తప్పదు రా."
"వీడిని బేసిక్ ప్రశ్నలు అడగండి చాలు, మిగతావి మనమే వీడిని బట్టి రాసేద్దాం"
"సర్లే పద, ఇక్కడ నుండి ఎంత తొందరగా బైట పడితే అంతా మంచిది"
ఒక్కొక్క ప్రశ్న అడగడం మొదలెట్టా. వీడు నిజంగా నన్ను మించిపోయాడు. వీడు చెప్పినట్టు సమాధానాలు చెప్పాలంటే ఖచ్చితంగా మెదడు తిరగేసి  ఉండాలి. ఎలాగోలా అయిందనిపించేసరికి  చావు తప్పి కన్ను లొట్టపోయినట్టైంది.

నాకన్నా రామంగాడికి ఎక్కువ పిచ్చి ఎక్కినట్టుంది, " పదండి ఇంక వెళ్ళిపోదాం, ఈవాల్టికి చాలు" అన్నాడు.
" ఇలా అయితే మనకు అసైన్ చేసింది పూర్తవ్వదు. ఇప్పుడే మొదలెట్టాం కదా, అలానే ఉంటుంది, ఇలాంటి దెబ్బలు ఓ నాలుగైదు తగిలాయనుకో, నువ్వే రాటుదేలిపోతావ్. అప్పుడు జనం ఛీ! యదవ అని తిట్టినా నీకేం అనిపించదు"
నేను వెటకారంగా అన్నా రామంగాడు సీరియస్ గా తీసుకున్నట్టున్నాడు, మాట్లాడకుండా నా వెంట నడిచాడు.

ఈసారి తెలుగు మాస్టార్ని ప్రశ్నలు అడగమని చెప్పి తరువాత ఇంటి బెల్ కొట్టాం. లోపల వాళ్ళు వచ్చి సాదరంగా లోపలి ఆహ్వానించి, AC వేసి, సోఫాలో కూర్చోబెట్టి, కూల్ డ్రింక్ ఇచ్చి, అడిగిన ప్రశ్నలు అన్నింటికీ తడుముకోకుండా సూటిగా సమాధానాలు చెప్పడమే కాకుండా, జనాభా లెక్కల్లో మాకు ఉన్న సందేహాలు కూడా కొన్ని తీర్చారు. తెలుగు మాష్టారు ప్రశ్నలు అడిగి రాసుకుంటుంటే, నేను రామం గాడు నోరెళ్ళబెట్టి చూస్తూ కూర్చున్నాం. అంతా అయ్యాక నోరాక్క " మీకు ఇవన్ని ముందే ఎలా తెలుసండీ" అని ఆ ఇంటి పెద్దాయన్ని అడిగా. అయన, తాపీగా, " ఇలాంటి విషయాల్లో నేను చాలా పక్కగా ఉంటా. ముందే ఏమేం ప్రశ్నలు అడుగుతారో నెట్ లో చదివి వాటికి సమాధానాలన్నీ ఇంట్లో వాళ్ళ చేత ప్రాక్టీసు చేయించా. నేను లేకపోయినా వాళ్ళు సరిగ్గా చెప్పాలిగా మరి. ఇది అసలు మన దేశ అభ్యుదయానికి సంబంధించిన  విషయం. తేలిగ్గా తీసుకోకూడదు కదా.." అన్నాడు. సాష్టాంగనమస్కారం చేద్దాం అనిపించింది. అందరూ మీలా ఆలోచించి ఉంటే మా పని ఎంత సులువయ్యేదిరా రామా..అనుకుంటూ ఆయనకో నమస్కారం చేసి అక్కడినుండి బయలుదేరాం.

 తర్వాత కొన్ని ఇళ్ళలో పెద్దగా ఎదురుదాడి ఎక్కడా ఎదురవలేదు. మధ్యాహ్నం ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్లి భోజనం ముగించి మళ్లీ రెండయ్యేసరికల్లా పని మొదలెట్టాం.

No comments:

Post a Comment